మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించాలనేది ఆ యువకుడి కల. అందుకోసం బాల్యం నుంచే కసరత్తులు ప్రారంభించాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. పట్టుదలతో కృషి చేశాడు. రోజంతా టీ అమ్ముకొని.. సాయంత్రం మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేవాడు. ఇందుకోసం కఠోరంగా శ్రమించాడు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఈ మండ్య కుర్రాడు.. మరో ఘనత సాధించాడు. టోర్నడో కిక్ కేటగిరిలో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు గెలుచుకున్నాడు.
టీ అమ్ముతూ.. శిక్షణ తీసుకుంటూ..
కర్ణాటకాలోని మండ్య జిల్లాకు చెందిన రాజన్న, వరలక్ష్మి దంపతులకు జన్మించిన ఆర్.శశాంక్‌కు చిన్నతనం నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం.ఇందుకోసం డాక్టర్ ఎస్ కృష్ణమూర్తికి చెందిన ఒషుకోయి మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో చేరాడు. ఇప్పటి వరకు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న శశాంక్.. 2019లో జాతీయస్థాయి పోటీల్లో రజతం సంపాదించాడు.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న శశాంక్ కుటుంబానికి కరోనా మరింత భారాన్ని పెంచింది. గతేడాది మహమ్మారి వల్ల శశాంక్ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత శశాంక్ మీద పడింది. ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయం 3నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీ అమ్మేవాడు. తప్పనిసరిగా రోజూ సాయంత్రం మూడు గంటల పాటు శిక్షణ పొందేవాడు.
నిమిషానికి 62 టోర్నడో కిక్స్..
కరాటేలో టోర్నడో కిక్స్పైన దృష్టి సారించిన శశాంక్.. శారీరకంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 540 డిగ్రీల కోణంలో శరీరాన్ని కదిలిస్తూ సాధన చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. శశాంక్ లక్ష్యం ఒక్క నిమిషంలో వీలైనన్ని ఎక్కువ కిక్స్ చేయడం. ఈ క్రమంలో అతను అనేక సార్లు అస్వస్థతకు గురయ్యాడు. కానీ పట్టువిడవకుండా కసరత్తులు కొనసాగించాడు. మొదట నిమిషానికి 10 కిక్స్ మాత్రమే చేయగలిగిన శశాంక్ ఆ సంఖ్యను క్రమంగా 60కి పెంచాడు.
ఈ కిక్స్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నోబెల్ వరల్డ్ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా.. ఓ వీడియోను చేసి పంపమని వారు సమాధానం ఇచ్చారు. దీంతో ఏప్రిల్ 10న టోర్నడో కిక్స్ చేస్తున్న వీడియోను సంబంధింత ఆర్గనైజేషన్‌కు పంపాడు. నిమిషానికి 62 టోర్నడో కిక్స్ చేస్తున్న శాశంక్ వీడియోను చూసిన యాజమాన్యం జూన్ 21న అతనికి అవార్డు సహా ఓ పతకాన్ని అందించింది.
తాను ప్రపంచ రికార్డు సాధించినందుకు సంతోషంగా ఉందని శశాంక్ వెల్లడించాడు. టోర్నడో కిక్స్ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి కూడా పంపించినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి : రెండేళ్ల 'సూపర్ కిడ్'- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు