కేరళలో బావిలో చిక్కుకుపోయిన వ్యక్తి మరణించాడు. తిరువనంతపురంలో పైపులు దింపడానికి 100 అడుగుల బావిలోకి దిగి.. గంటల పాటు నరకయాతన అనుభవించిన వ్యక్తిని కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మట్టి పెళ్లలు పైన పడటం వల్ల 48 గంటలుగా బావిలో చిక్కుకుపోయిన అతడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. మృతుడిని తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల మహారాజన్గా గుర్తించారు. విళింజం సమీపంలోని ముక్కోల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Man Stuck In Well : శనివారం ఉదయం దాదాపు 9.30 గంటల ప్రాంతంలో ఘటనపై సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ సమయంలో మహారాజన్ శరీరం సగం బయటకి కనిపించిందని సహాయక సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత బావిలోకి పై నుంచి మట్టి పెళ్లలు కూలడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అతడిని కాపాడేందుకు యంత్రాల సాయంతో నీటిని బయటకు తీసినా ఫలితం లేదు. వారి వద్ద ఉన్న పరికరాలతో బాధితుడ్ని కాపాడడం సాధ్యం కాకపోవడం వల్ల.. ఇతర ప్రాంతాల నుంచి అధునాతన పరికరాలను తెప్పించారు. ఆ తర్వాత కొల్లాం నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మట్టి పెళ్లలు కూలకుండా చెక్కలను అడ్డం పెట్టారు. ఆదివారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేరుకుని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 48 గంటల తర్వాత మట్టిలో కూరుకుపోయిన మహారాజన్ మృతదేహాన్ని వెలికితీశారు.
బావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఓ బావిలో పడి ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన రాయ్‌పుర్ జిల్లాలో జరిగింది. చెట్టు ఎక్కి పండ్లు తెంపుతుండగా.. ప్రమాదవశాత్తు బావిలో జారిపడ్డారు ముగ్గురు చిన్నారులు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
అరంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛారౌద గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు జామకాయలు తెంపేందుకు ఇంటి పక్కనే ఉన్న చెట్టు ఎక్కారు. ఈ క్రమంలోనే జామకాయ తెంపుతుండగా.. కొమ్మ విరిగి ప్రమాదవశాత్తు బావిలో జారిపడ్డారు. బావిపై జాలిని కట్టినా.. అది తెగిపోయి లోపలికి పడిపోయారు. దీనిని గమనించిన ఓ మహిళ.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి వారిని బయటకు తీశారు. కానీ అప్పటికే ముగ్గురు చిన్నారులు మరణించారు.
ఇవీ చదవండి : 100 అడుగుల బావిలో చిక్కుకున్న వ్యక్తి.. నిన్నటి నుంచి అలానే..
బొలెరో- బుల్లెట్ ఢీ.. అదుపు తప్పి బావిలో పడ్డ కారు.. ఆరుగురు మృతి