Man shot dead in East Godavari: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు లో దారుణ హత్య జరిగింది. దస్తావేజుల లేఖరకి సహాయకునిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. పుల్లలపాడు కు చెందిన కాట్రగడ్డ ప్రభాకర్(60) అనంతపల్లి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజులో లేఖరుడికి సహాయకుడిగా పని చేస్తున్నాడు. కాట్రగడ్డ ప్రభాకర్ సాయంత్రం ఇంటిదగ్గర ఉన్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చాడు. తాను తెచ్చిన పండ్లను ప్రభాకర్ కి ఇచ్చాడు. కొంతసేపు అతనితో కూర్చుని ఆర్థిక లావాదేవీలు గురించి మాట్లాడాడు.
ప్రభాకర్‌కు అవతలి వ్యక్తికి మధ్య మాటా మాటపెరిగింది. ఆ వ్యక్తి తుపాకీతో ప్రభాకర్ చాతిపై రెండు రౌండ్లు కాల్చాడు. తుపాకీ శబ్దం విన్న ప్రభాకర్ భార్య ఇంటిలో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ దుండగుడు కారు ఎక్కి పరారయ్యాడు. ప్రభాకర్ అప్పటికే ప్రాణాలను కోల్పోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును, అందుకు కారణాలను సేకరిస్తున్నారు. కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభాకర్ తో కూర్చుని ఆర్థిక లావాదేవీలు గురించి మాట్లాడా డంటే తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.