Man Not to Marry Till Ram Mandir Built Invitation : మధ్యప్రదేశ్ బైతూల్‌కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్ భోజ్‌పలి బాబా ( Bhojpali Baba Ayodhya Invitation ) అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబర్ 6న శపథం చేసి, అలా ఒంటరిగానే ఉండిపోయారు.
"రామ్‌లల్లాను చిన్నపాటి చెక్క సింహాసనంపై శ్రీరామ్ పిరామల్ దాస్ ఉంచడాన్ని చూశాం. మన దేశంలో రాముడికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అనిపించింది. రాముడికి భారీ ఆలయం కట్టే వరకు పెళ్లి చేసుకోనని, హిందూ సంస్థల కోసం పని చేస్తానని నేను అప్పుడు శపథం చేశాను."
--రవీంద్ర గుప్తా, రామ భక్తుడు
అయోధ్య రామాలయం కర సేవకుల్లో రవీంద్ర ఒకరు. విశ్వహిందూ పరిషత్‌లో సభ్యునిగానూ ఉన్నారు.
"ఆర్ఎస్ఎస్లో రవీంద్ర క్రియాశీల సభ్యుడు. వీహెచ్‌పీకి అనేక చోట్ల ప్రాంతీయ సారథిగా ఉన్నారు. బైతూల్‌లో వీహెచ్‌పీ సారథి అయినప్పుడు మేము భోజ్‌పలి బాబాను కలిశాము."
--కృష్ణకాంత్ గవండే, స్థానిక కార్యకర్త
అయోధ్య ట్రస్ట్ ఆహ్వానంపై రవీంద్ర సంతోషంగా ఉన్నారు. దీనిని భగవంతుని ఆశీర్వాదంగా చూస్తున్నారు. "అయోధ్య రామాలయానికి రావాలని నన్ను శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహత్ కార్యంలో నేను భాగస్వామిని అవుతానని ఊహించలేదు. కానీ భోపాల్‌కు చెందిన ఓ చిరు న్యాయవాదికి, సాధువులా ప్రపంచమంతా తిరిగే ఓ వ్యక్తికి ఆహ్వానం అందేలా ఆ భగవంతుడే చేశాడు" అని రవీంద్ర గుప్తా వివరించారు.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తయినా తాను పెళ్లి చేసుకోనని చెప్పారు రవీంద్ర. తనకు వయసు పైబడిందని, రాముడికే అంకితమై జీవితాన్ని కొనసాగిస్తానని తెలిపారు.
చురుగ్గా ఏర్పాట్లు
ఇదిలా ఉండగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12-15 వేల మంది అయోధ్యలో బస చేసేలా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. వేర్వేరు చోట్ల 10 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది. ఆలయ నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.900 కోట్లు ఖర్చు చేశామని ట్రస్ట్ కోశాధికారి వెల్లడించారు. ట్రస్ట్ వద్ద ఇంకా పుష్కలంగా నిధులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ట్రస్ట్ వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయంటే?
అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్‌తో నెక్లెస్- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!
బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్ సూపర్!