Hatchery For Chicks: కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచం స్తంభించిపోయింది. ఫలితంగా ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి బతకడమే కష్టమైపోయింది. కొందరు మాత్రం ఆ లాక్‌డౌన్‌ను అవకాశంగా మలుచుకున్నారు. కష్ట సమయంలో స్వయం ఉపాధి పొందారు. ఆ కోవకే చెందుతాడు కేరళ ఇడుక్కి జిల్లాలోని రాజకుమారి గ్రామానికి చెందిన అభిజిత్. లాక్డౌన్లో యూట్యూబ్ వీడియోలు చూసి.. కోడిపిల్లల ఉత్పత్తి యూనిట్ నిర్మించి స్వయం ఉపాధి పొందాడు. ఇప్పుడదే అభిజిత్‌ను పోషిస్తోంది.
అభిజిత్.. తొలుత కాలక్షేపం కోసం కోడి పిల్లల ఉత్పత్తికి సంబంధించిన వీడియోలు చూసేవాడు. తద్వారా ఆదాయం పొందవచ్చని గ్రహించాడు. వీడియోలో వారు చెప్పిన విధంగా హేచరీ (కోళ్ల ఉత్పత్తి కేంద్రం) యూనిట్ నిర్మించడానికి కావాల్సిన థర్మోస్టాట్, ఫ్యాన్, బల్బులు, హీటర్, టైమర్, మోటారు, వాటర్ ఫాగర్, పెద్ద పెట్టెను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. ఇంటి వద్దే హేచరీ యూనిట్ నిర్మించాడు. తద్వారా ఇప్పటివరకు 3,000కుపైగా కోడిపిల్లలను ఉత్పత్తి చేసినట్లు అభిజిత్ చెబుతున్నాడు.
ఎక్కువగా దేశీవాళీ కోళ్ల రకాలు, ఔషధ గుణాలు కలిగిన నల్లకోళ్ల ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నట్లు అభిజిత్ తెలిపాడు. గుడ్లు పొదిగేందుకు 18 నుంచి 22 రోజుల సమయం పడుతుందని చెప్పాడు. కోడిపిల్లలు పుట్టాక వాటిని చెక్క బోనుల్లో పెట్టి, అవసరమైన వేడి తగిలేలా విద్యుత్ బల్బులను అమర్చినట్లు పేర్కొన్నాడు.
అభిజిత్ ఇప్పుడు తన యూనిట్ ద్వారా ఉత్పత్తయిన కోళ్ల నుంచి గుడ్లు, కోడిపిల్లలను విక్రయిస్తున్నాడు. తన వినియోగదారుల అభ్యర్థన మేరకు చిన్న హేచరీలను కూడా తయారు చేస్తున్నాడు. అతడు ఇప్పుడు ఒక పెద్ద యూనిట్‌ను నిర్మిస్తున్నాడు. అందులో ఒకేసారి 1500 కోడి పిల్లలను ఉత్పత్తి చేయగలడు.
ఇదీ చూడండి: Live Video: పెళ్లిలో ధూమ్‌ధామ్‌గా డాన్స్ చేస్తూ.. క్షణాల్లోనే మృత్యుఒడికి!