Man Kills Wife And Her Parents : అసోం.. గోలాఘాట్‌లో ఓ యువకుడు తన భార్యతోపాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా చంపాడు. అనంతరం తొమ్మిది నెలల కుమారుడిని వెంట తీసుకువెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.
అసలేం జరిగిందంటే?
Man Kills Wife And Family : ఇంజినీరింగ్ పూర్తి చేసిన నజీబుర్ రెహమాన్ బోరా (25)కు కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో సంఘమిత్ర ఘోష్ (24) అనే యువతితో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల్లోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడం వల్ల ఇంట్లో నుంచి పారిపోయి కోల్‌కతాలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. సంఘమిత్ర గర్భవతి అయ్యాక నజీబుర్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కుమారుడితో సహా సంఘమిత్ర తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నజీబుర్‌ను అరెస్ట్ చేశారు.
బెయిల్‌పై బయటకువచ్చిన నజీబుర్.. కుమారుడిని చూసేందుకు సంఘమిత్ర పుట్టింటివారికి వెళ్లాడు. అత్తమామలు అందుకు అనుమతించకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన నజీబుర్ భార్యతోపాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
"హత్యల వెనుక 'లవ్ జిహాద్' కోణం"
గోలాఘాట్‌లో జరిగిన మూడు హత్యలు 'లవ్ జిహాద్' పరిణామమని, 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదు చేసి నిందితుడిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిలబెడతామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో..
ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆమె శరీరాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఈ దారుణం బంగాల్లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో జరిగింది. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఇటీవలే మృతురాలి అస్థికలను సెప్టిక్ ట్యాంకులో గుర్తించారు సీఐడీ అధికారులు. మహిళ కనిపించకుండా పోయిన కేసులో ఆమె భర్తను గతంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ.. ఆమె మృతి విషయం ఇన్ని రోజులూ మిస్టరీగానే మిగిలిపోయింది. సీఐడీ రంగంలోకి దిగిన తర్వాత కేసు కొలిక్కి వచ్చింది.