కర్ణాటక మంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్యంతో మంచం పట్టిన భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ భర్త. భార్య అనారోగ్యం చూసి మనస్తాపానికి గురైన నిందితుడు ఆమెను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దినేష్, శైలజ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ జరిగింది..
దినేష్ రావు(67), శైలజా(64) అనే దంపతులు కపికాడ్లోని పూనమ్ పార్క్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. దినేష్ రావు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమారులు. వారిద్దరూ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. శైలజ గత ఆరేళ్లుగా న్యూరోపతితో బాధపడుతూ నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో మంచానికే పరిమితమైంది. ఆమె సంరక్షణ కోసం ఓ హోం నర్సును ఏర్పాటు చేశాడు దినేష్. ఎప్పటిలానే శుక్రవారం రాత్రి దినేష్ ఇంటికి వచ్చిన హోం నర్సు శనివారం ఉదయం వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న దినేష్ మనస్తాపానికి గురై భార్య శైలజను హత్య చేశాడు. అనంతరం తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం 8.30 గంటలకు శైలజారావును చూసుకునేందుకు హోమ్ నర్సు దినేష్ ఇంటికి వచ్చింది. ఎంతటికీ వారు తలుపులు తెరవకపోవడం వల్ల స్థానికులకు సమాచారం అందించింది. తలుపులు పగులగొట్టి చూడగా భార్య శైలజ, భర్త దినేష్‌రావు విగతజీవులుగా పడి ఉన్నారు.
మైనర్ల అసభ్యకర ఫొటోలు, వీడియోలు..
ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థినిల అసభ్యకర ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ ముఠాను పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ అసభ్యకర వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 25 మంది నిందితులపై కేసు నమోదు పోలీసులు.. అందులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందిలందరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
నిందితులు.. విద్యార్థినిలతో మొదట స్నేహం చేయడం మొదలుపెట్టారు. అలా కాస్త పరిచయం పెరిగాక వారి అసభ్యకర ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. పరువు పోతుందనే భయంతో బాధితులు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఓ బాలిక మాత్రం ఓ ఎన్జీఓకు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. దీంతో నిందితులపై ఎన్జీఓ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ నిందితుడి అరెస్ట్ చేసి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడి ఫోన్లో 300కు పైగా బాలికల అసభ్యకర ఫొటోలు, వీడియోలను కనుగొన్నారు. వీటి ఆధారంగానే ఈ ముఠా నిందితులు బాలికలను వేధిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
12వ తరగతి విద్యార్థి నా బాయ్‌ఫ్రెండ్. దీంతో తరచుగా ఇద్దరం కలుసుకునేవాళ్లం. అతడి సెల్లో సెల్ఫీలు దిగేవాళ్లం. అలాగే వీడియోలు తీసుకునేవాళ్లం. అయితే నెల క్రితం నాకు తెలియని మొబైల్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తమ వద్ద నా న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించారు. తనను కలవమని బలవంతం చేశాడు. నా ప్రియుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పా. అయితే అతడు కోపంగా ఫోన్ కట్ చేశాడు. దీంతో కంగారుపడ్డా. నా ప్రియుడే నా వ్యక్తిగత ఫొటోలు వారికి పంపినట్లు ఆ తర్వాత తెలిసింది. నా స్నేహితురాళ్లకు ఈ విషయం చెప్పా. అయితే వారికి ఇలాగే కాల్స్ వచ్చినట్లు చెప్పారు. పరువు పోతుందనే భయంతో వారు నిందితులను కలుస్తున్నారు. అలా వారితో బలవంతంగా లైంగిక చర్యల్లో పాల్గొంటున్నారు.
--బాధితురాలు