సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి తొమ్మిది వేల పేజీల వివరాలను పొందాడు. అందుకు రూ. 25వేల వరకు చెల్లించాడు. ఈ పేజీలను లెక్కపెట్టడానికి రెండు గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. దాని కోసం నలుగురు వ్యక్తులను సైతం వెంటతెచ్చుకున్నాడు.
మధ్యప్రదేశ్ శివపురికి చెందిన ఆర్టీఐ కార్యకర్త మఖన్ ధాకడ్ బైరాడ్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తును పెట్టుకున్నాడు. అందులో పీఎం హౌసింగ్, సంబల్ పథకం నిర్మాణ పనుల్లో చెల్లింపులతో పాటు, స్వచ్ఛత మిషన్ కింద కౌన్సిల్ కొనుగోలు చేసిన మెటీరియల్ గురించి సమాచారం కోరాడు.
అయితే అతను చేసిన దరఖాస్తుకు సంస్థ స్పందించలేదు. తరువాత అప్పీలుకు భోపాల్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి నుంచి సమాచారం వచ్చిందని తెలియగానే మఖన్ ధాకడ్... డప్పులతో ఎద్దుల బండిపై బైరాడ్ నగరపాలక సంస్థకు వెళ్లాడు. సమాచారం తీసుకొని తలపై కాగితాల కట్ట పెట్టుకొని ఊరేగింపుగా తన కార్యాలయానికి బయలుదేరాడు. నగరంలో ఈ వేడుక చర్చనీయాంశంగా మారింది.
దీని కోసం చాలా పోరాటం చేశానన్నాడు ఆర్టీఐ కార్యకర్త మఖన్ ధాకడ్. ఈ సమాచారం పొందడానికి రూ.25 వేలు ఖర్చు అయిందన్నాడు. డబ్బులు లేకపోతే అప్పు చేశానని చెప్పుకొచ్చాడు. జేబులు ఖాళీగా ఉన్నాయనే బాధ కంటే సమాచారం అందిందన్న ఆనందం ఎక్కువగా ఉందన్నాడు మఖన్ ధాకడ్.