అంబులెన్స్‌లో కుమారుడి మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులు లేక.. బ్యాగులో పెట్టి బస్సులో ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి!. బంగాల్లోని ఉత్తర దినాజ్‌పుర్ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. అసలేం జరిగిందంటే?
కుటుంబసభ్యుల వివరాల పక్రారం.. జిల్లాలోని కలియాగంజ్ బ్లాక్ ముస్తఫానగర్ పంచాయతీలోని దంగీపరా గ్రామానికి చెందిన అషిమ్ దేబ్ శర్మ భార్య ఐదు నెలల క్రితం పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే అషమ్ ఇద్దరు కుమారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ మే7న కలియాగంజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం వల్ల మే8న రాయ్‌గంజ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయతించినా చిన్నారుల ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం మే10న శిలిగుడి బోధనాసుపత్రిలో చేర్పించారు.
అయితే ఓ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం వల్ల మే11న మెడికల్ కాలేజీ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అషిమ్ దేబ్ శర్మ.. మరో కుమారుడితో ఆస్పత్రిలోనే ఉన్నాడు. చికిత్స పొందుతున్న ఆ చిన్నారి.. మే 13 రాత్రి మృతి చెందాడు. అయితే అషిమ్.. తన కుమారుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ అంబులెన్స్ డ్రైవర్ రూ.8 వేలు అడిగాడట. అయితే అషిమ్.. చిన్నారుల వైద్యం కోసం అప్పటికే రూ.16వేలు ఖర్చు పెట్టాడు.
దీంతో అషిమ్ వద్ద డబ్బులు లేవు. చేసేదేం లేక.. ఆదివారం ఉదయం కుమారుడి మృతదేహాన్ని బ్యాగులో పెట్టి.. మెడికల్ కాలేజీ నుంచి అషిమ్ బయలుదేరాడు. శిలిగుడి నుంచి రాయ్‌గంజ్‌కు బస్సులో చేరుకున్నాడు. ఆ తర్వాత కలియాగంజ్‌కు మరో బస్సులో వెళ్లాడు. అక్కడి వెళ్లాక తన సన్నిహితులతో విషయం మొత్తాన్ని వివరించాడు. అదంతా తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు.. అషిమ్ తన స్వగ్రామానికి చేరుకునేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కుమారుడి మృతదేహంతో దంగిపరాలోని తన నివాసానికి అతడు చేరుకున్నాడు. కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశాడు.
ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి స్పందిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్వస్థ్య సాథి' ఆరోగ్య పథకంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి బెంగాల్ మోడల్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలను టీఎంసీ తిప్పికొట్టింది. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది.
అంబులెన్స్‌కు డబ్బులేక భర్త మృతి.. అలా ఎవరికీ కాకూడదని ఆమె ఏం చేసిందంటే?
చనిపోయిన తన భర్త జ్ఞాపకార్థంగా తక్కువ ధరకే అంబులెన్స్ సేవలను అందిస్తోంది ఓ మహిళ. ఇలా ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ అనేక మంది మనసుల్లో చోటు సంపాదించుకుంది. మరి ఆమె గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
బామ్మకు అస్వస్థత.. రిక్షా తోసుకుంటూ..
అస్వస్థతకు గురైన తన బామ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డాడు ఎనిమిదేళ్ల బాలుడు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్ల వృద్ధురాలిని రిక్షాపై తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని బొకారోలో జరిగింది.