మహారాష్ట్ర ఠాణె జిల్లాకు చెందిన గౌతమ్ రత్నా మోర్ అనే వ్యక్తి భిన్నంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. నవంబరు 19న తన 54వ పుట్టినరోజు వేడుకలను స్థానిక శ్మశానంలో నిర్వహించాడు. శనివారం రాత్రి సమయంలో నిర్వహించిన ఈ వేడుకకు 40మంది మహిళలు, చిన్నపిల్లలతో సహా 100మంది విచ్చేశారు. అక్కడే కేక్ కోసి పుట్టినరోజు జరుపుకున్నాడు గౌతమ్. వేడుకలకు వచ్చిన అతిథులకు శ్మశానంలోనే బిర్యానీ, కేక్ వడ్డించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే, సమాజంలో ఉన్న అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను రూపుమాపేందుకే ఇలా వినూత్నంగా ఆలోచించానని చెప్పాడు గౌతమ్. ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్, ప్రముఖ హేతువాది దివంగత నరేంద్ర దభోల్కర్లు.. అంధవిశ్వాసాలు, చేతబడి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారాలతో ప్రేరణపొంది ఈ వేడుకలను స్మశానంలో నిర్వహించానని చెప్పారు. దెయ్యాలు, భూతాలు వంటి వాటి ఉనికి లేదని ప్రజలకు తెలియజేయాలని ఇలా చేశానని మోర్ తెలిపారు.