తనను ఒంటరి వాడిని చేసి వెళ్లిపోయిన భార్య కోసం ఓ భర్త గుడి కట్టించాడు. మరణించిన ఆమెను విగ్రహ రూపంలో చూసుకుంటున్నాడు. భార్య ప్రతిమకు నిత్యం పూలమాలలు వేస్తూ.. తన ప్రేమను చూపిస్తున్నాడు.
తమిళనాడు కోయంబత్తూర్లోని గణేశపురం గ్రామానికి చెందిన పళనిస్వామి(75), సరస్వతి(59) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పళనిస్వామి వృత్తిరీత్యా రైతు. అయితే 2019లో సరస్వతి బాత్రూమ్కు వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. పళనిస్వామి.. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమె గుర్తుగా ఏదైనా చేయాలనుకున్నాడు.
కాగా.. సరస్వతి మృతదేహాన్ని తోటలో పూడ్చిపెట్టారు కుటుంబ సభ్యులు. మొదటి వర్థంతి సందర్భంగా తన భార్య సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 3 ఏళ్లుగా పళనిస్వామి తన భార్య విగ్రహానికి రోజుకి రెండుసార్లు దీపం వెలిగించి పూజలు చేస్తున్నాడు. తన భార్యతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పళనిస్వామి తెలిపాడు. ప్రతి రోజూ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని చెప్పాడు.
"పెళ్లైన రోజు నుంచి మేమిద్దరం సంతోషంగా జీవిస్తున్నాం. 45 ఏళ్ల మా దాంపత్యంలో ఎప్పుడూ గొడవలు జరగలేదు. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. అయితే నా భార్య సరస్వతి మరణం నన్ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణించినా.. నాతోనే ఉండాలనుకుంటున్నా. అందుకే ఆమె కోసం స్మారక మందిరం నిర్మించా. నా భార్య సరస్వతి విగ్రహానికి రోజూ పూజలు చేస్తా. ఆమె విగ్రహం వద్ద దీపం వెలిగిస్తా. సరస్వతి బతికుండగానే కొత్త ఇల్లు నిర్మించా. ఆ ఇంటికి 'పళనిస్వామి- సరస్వతి' అని నామకరణం చేశా. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ"
--పళనిస్వామి
ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. లేదంటే ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకాడట్లేదు. ఇలాంటి కాలంలో పళనస్వామి లాంటి భర్తలు ఉండడం అరుదు అనే చెప్పాలి.