Man Arrested For Cheating 100 Womens: పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వందకు పైగా మహిళలను మోసం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. దిల్లీ పహాడ్గంజ్కు చెందిన ఫర్హాన్ తసీర్ ఖాన్ ప్రస్తుతం ఒడిశాలో నివసిస్తున్నాడు. ఇతడు అనేక మంది మహిళలను పెళ్లి పేరుతో బురిడీ కొట్టించాడు. దిల్లీ ఎయిమ్స్‌లో పనిచేసే వైద్యురాలిని మ్యాట్రిమోని సైట్లో కలిశాడు. తాను ఓ అనాథనని.. ఏంబీఏ పూర్తిచేసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఫర్హాన్.. వ్యాపారాన్ని విస్తరిస్తానని ఆమె వద్ద రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఫర్హాన్ మోసాన్ని గుర్తించిన వైద్యురాలు పోలీసుల్ని సంప్రదించింది.
విచారణలో అనేక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇతడు నకీలీ ఖాతాలు సృష్టించి.. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది మహిళల్ని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు తేలింది. అమ్మాయిలను నమ్మించడానికి బంధువులకు చెందిన వీవీఐపీ రిజిస్ట్రేషన్ గల ఖరీదైన కారులో తిరిగేవాడు. గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు అతడిని పహాడ్‌గంజ్‌లో పట్టుకున్నారు. ఫర్హాన్‌కు మూడేళ్ల కూతురితో పాటు తండ్రి, సోదరి ఉన్నారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్, నాలుగు సిమ్కార్డ్స్, తొమ్మిది ఏటీఎమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: శాలరీ నిలిపివేసిన హెడ్మాస్టర్పై హైకోర్టు గరం.. నెలరోజులు సస్పెండ్