బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతున్నారు. అధికార భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 25న మమతాబెనర్జీ దిల్లీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi), ఎన్సీపీ అధినేత శరద్‌పవార్(Sharad Pawar), సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ తదితరులతో విడివిడిగా సమావేశం కానున్నారు. బంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత దీదీ దిల్లీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికార భాజపాకు వ్యతిరేకంగా పలు అంశాలను లేవనెత్తేందుకు కాంగ్రెస్ సహా విపక్షాల్నీ సిద్ధమవుతున్న తరుణంలో దీదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
పవార్ ఇంట్లో భేటీ..
ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ హోరాహోరీ పోరులో భాజపాను మమతా బెనర్జీ ఓడించడం ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో మూకుమ్మడిగా భాజపాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలన్నీ ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్ ఇంట్లో ఇటీవల సమావేశమయ్యాయి. దీనికి కాంగ్రెస్ నేతలు హాజరు కాలేదు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, ఆర్‌ఎల్‌డీ, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా, సమాజ్‌వాదీ పార్టీ నేత ఘనశ్యామ్ తివారీ, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఆప్ నుంచి సుశీల్ గుప్తా, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, సీపీఎం నుంచి నిలోత్పల్ బసు పాల్గొన్నారు. వీరితో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ మాజీ నేత సంజయ్ ఝా, జనతాదళ్ (యునైటెడ్) నేత పవన్ వర్మ కూడా ఉన్నారు. కానీ, ఇది రాజకీయ సమావేశం కాదని, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల మధ్య ఇంటరాక్షన్ అని సమావేశం అనంతరం నేతలు వెల్లడించారు.
కానీ, కాంగ్రెస్‌యేతర, భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వీరంతా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మమతా బెనర్జీ కీలక విపక్షనేతలతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనూ భేటీ అవుతారని వార్తలు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే అగ్రనేతలంతా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:'బంగాల్ హింస' నివేదికపై మమత గుస్సా