బంగాల్ ఎన్నికల వేళ కోల్‌కత్తాలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. బంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, ఐఎస్ఎఫ్ వ్యవస్థాపకుడు పీర్ జాదా అబ్బాస్ సిద్దిఖీతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన సంయుక్త ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన చౌదరీ.. భారీగా తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే.. లౌకిక శక్తుల ముందు టీఎంసీ, భాజపాలు తలొగ్గడం ఖాయమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని లెఫ్ట్ గ్రాండ్ కూటమి.. తృణమూల్‌తో పాటు భాజపాను ఎదుర్కొంటుందని ప్రకటించారు.
''టీఎంసీ, భాజపాలు ఎన్నికల్లో తమకు ఎదురులేకుండా చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండూ తప్ప మరో రాజకీయ శక్తి ఉండకూడదని కోరుకుంటున్నాయి. అయితే వారికి తెలియని విషయమేమిటంటే భవిష్యత్తులో ఆ రెండింటికీ ప్రత్యామ్నాయంగా గొప్ప సంకీర్ణ కూటమి ఉండబోతోంది.''
-అధీర్ రంజన్ చౌదరీ, బంగాల్ పీసీసీ అధ్యక్షుడు
భాజపాతో మమత పొత్తు..
బంగాల్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే మమతా బెనర్జీ.. మరోమారు భాజపాతో చేతులు కలుపుతారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్-భాజపాల మతతత్వ ఎజెండాను నిలువరించాలంటే మొదట తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించాల్సి ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేతోనూ మమత చేతులు కలుపుతారని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఘర్షణలను 'మాక్ ఫైట్'గా అభివర్ణించారు ఏచూరి. దేశానికి అన్నం పెట్టే రైతు ఆందోళనలపై మోదీ స్పందించట్లేదని విమర్శించారు.
''భారతదేశాన్ని భాజపా నుంచి, బంగాల్‌ను టీఎంసి నుంచి కాపాడాలి. తృణమూల్ కాంగ్రెస్ ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తోంది.''
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
మమతా బెనర్జీ అహంకారానికి బంగాల్ ప్రజలు రానున్న ఎన్నికలలో గుణపాఠం నేర్పుతారని ది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) అధ్యక్షుడు అబ్బాస్ సిద్దిఖీ ప్రకటించారు. మమత నేతృత్వంలోని టీఎంసీని భాజపాకు బీ-టీంగా అభివర్ణించారు.
ఇదీ చదవండి: మిత్ర పక్షాల అండతో విజయంపై 'హస్తం' గురి!