నందిగ్రామ్‌లో తనపై దాడి జరిగిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పశ్చిమబంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలిగే ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ.. ఈ మేరకు ఓ వీడియో సందేశం పంపారు.
"శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కోరుతున్నా. నిన్న కారు వద్ద నిల్చుని ఉన్నప్పుడు నన్ను తోశారు. నా చేయి, కాలు, మోకాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య చికిత్స కొనసాగుతోంది. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతా. త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. అవసరమైతే వీల్‌చైర్‌పైనే ప్రచారం చేస్తా"
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
బుధవారం నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన ఆమెపై దాడి జరిగింది. ఈ ఘటనలో మమత కాలికి గాయమైంది. రెండుమూడు రోజుల్లో ప్రచారంలో పాల్గొంటానన్నారు. కాలి గాయం సమస్యే అయినప్పటికీ ప్రచార సభలపై ఆ ప్రభావం ఉండబోదన్నారు.
కొన్నిరోజులపాటు చక్రాల కుర్చీలో తిరుగాడాల్సి ఉంటుందన్న మమత..అందుకు కార్యకర్తల సహకారం కావాలని వీడియో సందేశంలో కోరారు.
ఇదీ చూడండి: మమతకు గాయం: కుట్రా? నాటకమా?