2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవి కోసం పోటీ చేయడంపై బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee Pm 2024) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అన్నీ ఇప్పుడే చెబితే.. తర్వాత నేను ఏం చెప్పాలి?" అని ఆమె వ్యాఖ్యానించారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న మమత(Mamata Banerjee News).. శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
"లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా?" అని విలేకరులు ఆమెను ప్రశ్నించారు. "2024 ఎన్నికల్లో మేం పోటీ చేస్తాం. మేము పారదర్శకంగా ఉంటాం. మా పార్టీ దాగుడు మూతల ఆటలు ఆడదు" అని మమత సమాధానమిచ్చారు. ఇదే ప్రశ్నను మరో జర్నలిస్టు అడగగా... "మీరు ఎందుకు పీఎం పదవి కోసం పోటీ చేయరు? మీరు మీడియాలో ఉన్నారు. మీరు కూడా పోటీ చేయవచ్చు" అని వ్యాఖ్యానించారు.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి.. మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు మమత(Mamata Banerjee News). ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా దేశ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె.. గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
'ఆయననే అడగండి..'
దేశ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు భాజపా కేంద్రంగా ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. దీనిపై మమతను విలేకరులు ప్రశ్నించగా... ఈ ప్రశ్నను తనను అడిగే బదులు ఆయనను అడిగితేనే బాగుంటుందని అన్నారు. "బహుశా ఆయన ఉద్దేశం.. టీఎంసీ సత్తా చాటకపోతే భాజపా నిలుస్తుందని కావచ్చు" అని చెప్పారు.
'కొంకణీ నేర్చుకోవాలనుంటున్నా..'
గోవా ఎన్నికలు తమకు అత్యంత ప్రధానమైనవని మమత వివరించారు. ఇందుకోసం తాను ఆ రాష్ట్ర అధికార భాష కొంకణీని నేర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. "నేను మీ సోదరిని. ఇక్కడికి నేను అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో మాత్రమే రాలేదు. ప్రజలు ఎప్పుడైనా సమస్యల్లో ఉంటే.. అది నన్ను కలచివేస్తుంది. గోవా అందమైన రాష్ట్రం. ఇక్కడి సోదరులు, సోదరీమణులు అంటే నాకెంతో ఇష్టం" అని ఆమె పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో టీఎంసీకి అవకాశాన్ని ఇవ్వాలని గోవా ప్రజలను ఆమె కోరారు. టీఎంసీ ఎట్టిపరిస్థితుల్లోనూ దేనికోసం రాజీపడని పేర్కొన్నారు. గోవాలో తాము అధికారంలోకి వస్తే.. బంగాల్లో యువత, మహిళ కోసం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: