బంగాల్లో ముగిసిన మొదటి దశ ఎన్నికల్లో 30 సీట్లకు గాను.. 26 స్థానాల్లో భాజపా గెలుచుకుంటుందని అమిత్ షా చేసిన ప్రకటనను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ఓట్లు లెక్కింపు అనంతరం ప్రజా తీర్పు స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు.
''నిన్న ఓటింగ్ జరిగిన 30 సీట్లలో 26 స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందని ఓ భాజపా నేత ప్రకటించారు. అసలు ఎన్నికలు ముగిసిన తెల్లారే తామే గెలుస్తామని ఆయన ఎలా చెబుతారు? మొత్తం 30 స్థానాలు తమవేనని చెప్పుకోవచ్చు కదా? వాటిని కాంగ్రెస్, సీపీఎంలకు వదిలిపెట్టారా?''
-మమతా బెనర్జీ
ప్రజలు మాతోనే..
నందిగ్రామ్ సమీప నియోజకవర్గమైన చండీపూర్‌లో మమత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను తానేమీ ఊహించట్లేదని.. అది ఓటర్లు ఇచ్చే తీర్పు అని స్పష్టం చేశారు. 84 శాతం ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ప్రజలు టీఎంసీకే ఓటు వేశారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 1న నందిగ్రామ్ సహా.. 29 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.
కార్యకర్తలకు హెచ్చరిక..
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా.. ప్రతిపక్షాల నుంచి ముడుపులు స్వీకరించినా తనకు తెలుస్తుందని టీఎంసీ కార్యకర్తలను మమత హెచ్చరించారు. తాను ఇంతకుముందు ఇలా ఎక్కడా చెప్పలేదని.. అయితే నమ్మక ద్రోహులను(సువేందు అధికారిని ఉద్దేశించి) ఎదుర్కొంటున్న క్రమంలోనే ఇలా చెప్పాల్సివస్తోందని వ్యాఖ్యానించారు. టీఎంసీ ఏజెంట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్ బూత్‌లను విడిచివెళ్లొద్దని మమత సూచించారు.
ఆ సమయంలో ఎక్కడ?
మైనారిటీ ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ నాయకుడు బంగాల్ వచ్చారని మమత విమర్శించారు. అయితే దిల్లీ, గుజరాత్‌లలో మత కలహాలు జరిగిన సమయంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. 26సీట్లను తామే గెలుస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలపై టీఎంసీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందించారు. మోదీ-షా మైండ్ గేమ్స్ బంగాల్లో పనిచేయవని విమర్శించారు.
ఇదీ చదవండి: బంగాల్ తొలి దశలో 84.13శాతం పోలింగ్