తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఆస్తుల జాబితాను వెల్లడించారు. తనకు మొత్తం రూ.16.72 లక్షల విలువైన నికర చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. వాహనాలు, స్థిరాస్తులేవీ లేవని స్పష్టం చేశారు.
తగ్గిపోయాయ్
2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీదీ ఆస్తి రూ. 30.45 లక్షలుగా ఉండేది. దీన్ని బట్టి ఈ ఐదేళ్లలో దీదీ ఆస్తులు దాదాపు సగానికి పడిపోయినట్లు తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దీదీ రూ.10,34,370 ఆదాయాన్ని సంపాదించారు. రూ.930లను పుస్తకాలపై రాయల్టీగా పొందారు. ఈ ఏడాదికి దీదీకి రూ.1.85 లక్షల టీడీఎస్ రావాల్సి ఉంది.
ప్రస్తుతం మమత చేతిలో రూ.69,255 నగదు ఉంది. బ్యాంకులో రూ.13.53 లక్షలు ఉన్నాయి. ఇందులో రూ.1.51 లక్షలు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఖాతాలో ఉన్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(ఎన్ఎస్సీ)లో రూ.18,490ను డిపాజిట్ చేశారు. రూ.43,837 విలువైన తొమ్మిది గ్రాముల ఆభరణాలు దీదీ వద్ద ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి ఎంఏ చేశారు మమత. ఎల్ఎల్బీ పట్టాను సైతం అందుకున్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవు.
ఇదీ చదవండి: 'మమతపై దాడి' సీసీటీవీ ఫుటేజ్ విడుదల!