యాస్ తుపాను(yaas cyclone)పై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనను అరగంట పాటు వేచి ఉండేలా చేయడం, భేటీకి గైర్హాజరు కావడంపై వస్తున్న విమర్శలకు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Benarjee) వివరణ ఇచ్చారు. తాను ముందే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని, ఆ తర్వాతే ప్రధాని పర్యటన ఖరారైందని మమత తెలిపారు. అందువల్లే ప్రధాని సమీక్షా సమావేశంలో పాల్గొనలేకపోయానని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం(PMO)పై విమర్శలు గుప్పించారు దీదీ. తనపై మీడియాకు తప్పుడు సమాచారం అందిస్తోందని పీఎంఓపై మండిపడ్డారు. తనను ఇలా అవమానించరాదని సూచించారు.
"పీఎంఓ నన్ను అవమానించింది. నా ఇమేజ్ను దెబ్బతీసేలా ట్వీట్లు చేసింది. బంగాల్ సంక్షేమం కోసం కాళ్లు పట్టుకోవాలని మోదీ భావిస్తే అందుకు సిద్ధమే. అంతేగానీ అవమానించొద్దు. దయచేసి నీచమైన ఆటలాడొద్దు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినందునే కేంద్రం ఈ విధంగా వ్యవహరిస్తోంది. ప్రతి రోజూ తమతో ఎందుకు గొడవపడతారు?"
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
భాజపా నేతలెందుకు?
మరోవైపు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య నిర్వహించిన సమీక్షా సమావేశానికి భాజపా నేతలను, గవర్నర్ను ఎందుకు పిలిచారని ప్రశ్నించారు దీదీ. తుపాను నివేదికను ప్రధానికి అందజేసి ఆయన అనుమతితోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.
"మేం అక్కడికి చేరుకోగానే మీటింగ్ ప్రారంభమైంది. మమ్మల్ని కూర్చోమని అధికారులు చెప్పారు. నివేదిక అందించేందుకు ఒక నిమిషం పాటు అనుమతించాలని కోరాను. మీటింగ్ గంట తర్వాత ఉంటుందని ఎస్పీజీ బలగాలు తెలిపాయి. కాన్ఫరెన్స్ రూంలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. సీఎం, పీఎం మధ్య సమావేశం ఉంటుందని నాకు చెప్పారు. కానీ అక్కడ భాజపా నేతలెందుకు ఉన్నారు?"
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
ఇదీ చదవండి- మోదీ- దీదీ 'భేటీ'పై వివాదం
తనతో పాటు తన ముఖ్య కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్నూ అవమానించారని మమత ధ్వజమెత్తారు. సీఎస్ బంగాలీ వ్యక్తి కావడం వల్లే ఇదంతా చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనిచేయకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఇవీ చదవండి-