Mamata Banerjee Lok Sabha Election : సార్వత్రిక ఎన్నికలపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లోనే వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదన్నారు. ప్రచారం కోసం ఇప్పటికే కాషాయ పార్టీ అన్ని హెలికాప్టర్లను ముందస్తుగా బుక్ చేసుకొందన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మమత.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
'మరోసారి అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనే'
Mamata Banerjee VS BJP : మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనేనని మమతా బెనర్జీ ఆరోపించారు. బంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికామని.. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తోందని.. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని పేర్కొన్నారు.
'ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ వెళ్లవచ్చని అంచనా వేస్తున్నా. ప్రచారం కోసం అవసరమైన అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ఇప్పటికే ముందస్తుగా బుక్ చేసుకొంది. మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన. లోక్‌సభ ఎన్నికలలోపు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఈడీ అరెస్ట్ చేయాలని యోచిస్తోందని నాకు తెలిసింది.' అని మమతా బెనర్జీ.. బీజేపీపై మండిపడ్డారు.
గవర్నర్ తీరుపై మండిపాటు..
అలాగే బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తీరుపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ.. ఆయన తీరు మాత్రం బాగాలేదన్నారు. ఇక ఇటీవల జాదవ్‌పుర్ యూనివర్సిటీలో జరిగిన వివాదంపైనా స్పందించిన మమతా.. 'గోలీ మారో' అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు.
రాష్ట్రంలో కొందరు చట్టవిరుద్ధంగా బాణాసంచా ఫ్యాక్టరీలు నడుపుతున్నారని మమత అన్నారు. వారికి కొందరు పోలీసులు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎక్కువ మంది పోలీసులు తమ విధులను చిత్తశుద్ధితో చేస్తున్నారని.. కొందరు మాత్రమే నిందితులకు సాయం చేస్తున్నారని తెలిపారు.