రాబోయే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 50వేల ఓట్ల తేడాతో గెలుస్తానని భాజపా నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం కోల్కతా నుంచి వచ్చే మమతను.. ఓడించి తిరిగి అక్కడికే పంపిస్తానని జోస్యం చెప్పారు. భాజపా అధిష్ఠానం తనకు ఓ గొప్ప బాధ్యత అప్పగించిందని.. రాష్ట్రవ్యాప్తంగా కమలం వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బంగాల్లో భాజపా గెలిస్తే సువేందు ముఖ్యమంత్రి అవుతారా? అని మీడియా ప్రశ్నించగా.. 'భాజపాలో నిర్ణయాలు ఒక్కొక్కటిగా తీసుకోరు. క్రమశిక్షణ గల పార్టీకి, నిజాయితీ గల సైనికుడిని నేను. మేమంతా ఒక జట్టుగా పనిచేస్తున్నాం. అనాలోచిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నాకు ఇష్టం లేదు', అని సమాధానం ఇచ్చారు.