దేశ అభివృద్ది కోసం బీజేపీ ఏం చేయలేదని.. కేవలం ప్రచారం మాత్రమే చేసుకుందని మండిపడ్డారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమై.. వ్యుహరచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా అందరూ ఏకం కావాలని ఆకాంక్షించారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన అనంతరం.. నీతీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మధ్యాహ్నం నీతీశ్ కుమార్.. ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి కోల్‌కతాకు వెళ్లారు. అనంతరం ఆ రాష్ట్ర సచివాలయం 'నబన్నా'కు వెళ్లి.. మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. తామంతా ఒకటేనన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని నీతీశ్ కుమార్ మమతా బెనర్జీతో చెప్పారు. భేటీలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీతో చర్చలు సానుకూలంగా జరిగాయని నీతీశ్ కుమార్ వెల్లడించారు.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, రూపాయి విలువ క్షీణించడం, ధరలు పెరిగిపోవడంపై.. నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకుండా.. ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తోందని విమర్శలు గుప్పించారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయం నబన్నాకు చేరుకున్నారు. వారిద్దరిని సచివాలయం గేట్ వద్ద మమతా బెనర్జీ స్వాగతం పలికారు. అనంతరం అరగంటకు పైగా ముగ్గురు కలిసి చర్చలు జరిపారు. ఆ తరువాత ముగ్గురు కలిసి మీడియాతో మాట్లాడారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు.. ప్రతిపక్షాల ఐక్యత ముఖ్యమని నీతీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏం జరిగినా అది దేశానికి ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నారు. మమతా బెనర్జీ మాట్లడుతూ.. "నేను ఇంతకు ముందే చెప్పాను. బీజేపీ ఓడించేందుకు అందరం ఏకతాటిపైకి రావాలని. అందుకు నేను.. నా ఇగోను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను."
"నేను నీతీశ్జీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. జయ ప్రకాశ్ నారాయణ తన ఉద్యమాన్ని బిహార్ నుంచే ప్రారంభించారు. ఇదే తరహాలో కూటమి మొదటి సమావేశం కూడా బిహార్‌లోనే జరగాలి. ముందు మనమంతా ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలి. తరువాత మానిఫెస్టో గురించి ఆలోచించాలి."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఈ సందేశాన్ని మొదట ప్రజల్లోకి తీసుకువెళ్లాని మమతా సూచించారు. బీజేపీతో పోరాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె వెల్లడించారు. తాను బీజేపీని జీరో చేయాలని అనుకుంటున్నట్లు తెలిపిన మమత.. కేవలం మీడియా మద్ధతుతోనే బీజేపీ హీరో అయిందన్నారు. ఫేక్ వీడియోలు, అబద్ధాలు, బెదిరింపులు చేస్తూ.. అధికారంలో వచ్చిందన్నారు. తమ కూటమి కూడా అలా వెళ్లకూడదని మమతా అభిప్రాయపడ్డారు. దీని గురించి.. ప్రతి ఒక్కరితో మాట్లాడి.. మనం కూడా ఒకరికొకరం మాట్లాడుకోవాలన్నారు. బంగాల్‌ను మమతా బెనర్జీ చాలా అభివృద్ది చేశారని నీతీశ్ కుమార్ కొనియాడారు. రాష్ట్రం మంచి పురోగతి సాధించిందన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రజలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుందన్నారు.
'పదవులపై యావ లేదు.. దేశానికి మంచి జరగాలి'
బిహార్ సీఎం నీతీశ్ కుమార్.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తోనూ చర్చలు జరిపారు. ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి లఖ్‌నవూ వెళ్లిన నీతీశ్ కుమార్.. విపక్షాల ఐక్యతపై చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న భాజపాను గద్దె దించడమే లక్ష్యమని.. అఖిలేశ్‌తో సమావేశం తర్వాత నీతీశ్ కుమార్ చెప్పారు. ఆ దిశగా విపక్షాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రచారం మాత్రమే చేసుకుంటోందని విమర్శించారు. తనకు పదవులపై యావ లేదన్న బిహార్ సీఎం.. దేశానికి మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న భాజపాను గద్దె దించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తానని అఖిలేశ్ చెప్పారు.