విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేతి వేళ్లతో సరదాగా పెన్ను తిప్పడం అందరికీ అలవాటే. అయితే ఈ సాధారణ అలవాటుతోనే గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు కేరళకు చెందిన మహ్మద్ సినాన్ అనే యువకుడు. బొటనవేలు చుట్టూ ఒక నిమిషంలో 108 సార్లు కలాన్ని తిప్పి.. అతడు ఈ ఘనత సాధించాడు. 88 సార్లు స్పిన్‌తో అగ్రస్థానంలో ఉన్న కెనడాకు చెందిన అలెసియా అమోటో నెలకొల్పిన రికార్డును మహ్మద్ బద్దలు కొట్టాడు.
మలప్పురం జిల్లాకు చెందిన మహ్మద్‌కు.. విద్యార్థి దశ నుంచే వేళ్లపై పెన్ను తిప్పడం అలవాటు. లాక్డౌన్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వీడియోలను చూస్తున్న సమయంలో తాను కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలనే ఆలోచన అతనికి వచ్చింది. ఇందుకోసం అతడు పెన్ను తిప్పే వేగాన్ని మరింత పెంచుకునేందుకు రోజూ సాధన చేసేవాడు.
ఉపాధ్యాయులు, స్నేహితుల సాయంతో బొటనవేలు చూట్టూ కలాన్ని తిప్పే వీడియోను గిన్నిస్ బుక్ నిర్వాహకులకు పంపాడు మహ్మద్. అలా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నాడు.
నౌషాద్ అలీ-లైలాబి కుమారుడైన మహ్మద్ సినాన్.. ప్రస్తుతం మలబార్ కాలేజ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో బీసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఇదీ చూడండి: ఈయన స్పీడ్‌కు గిన్నిస్ రికార్డులు దాసోహం