Making Tiles With Plastic In Mysuru : ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ సాయంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేసి పర్యావరణ హిత టైల్స్‌ను తయారు చేస్తోంది. 'సీ వేజ్' పేరుతో జాగృత్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మున్సిపల్ కార్పొరేషన్ సాయంతో మైసూరులోని విద్యారణ్యపురంలో పరిశ్రమను ప్రారంభించింది. మున్సిపల్ కార్పొరేషన్ సేకరించిన చెత్తలో నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను కంపెనీకి తీసుకొస్తోంది. వాటి నుంచి నాణ్యమైన టైల్స్‌ను రూపొందిస్తోంది.
"ప్రస్తుతం ప్లాస్టిక్ పెద్ద సమస్యగా మారింది. వాటర్ బాటిళ్లు లాంటివి కొన్ని ప్లాస్టిక్ వస్తువులను రీసైకిల్ చేస్తున్నారు. అయితే చిప్స్, చాకెట్లు, బిస్కెట్ లాంటి మల్టీ లేయర్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లే సమస్యగా మారాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లను రీసైకిల్ చేసే టెక్నాలజీని మేము కనుగొన్నాం. పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాం. కార్పొరేషన్ మాకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తుంది. దానితో మేము ప్లాస్టిక్ టైల్స్ తయారు చేస్తున్నాం"
- దర్శన్, జాగృత్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్
ముందుగా కార్పొరేషన్ నుంచి సేకరించిన ప్లాస్టిక్ కవర్లను మెషిన్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. వాటిని వేడి చేసి కరిగించి ఒక ముద్దలాగా మారుస్తారు. ఆ తర్వాత అచ్చు యంత్రంలో పెట్టి టైల్స్గా తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ టైల్స్ సిమెంట్ టైల్స్‌తో పోలిస్తే తక్కువ ధర అని, బరువు కూడా తక్కువేనని జాగృత్ టెక్ డైరెక్టర్ చెబుతున్నారు.
"ఈ టైల్స్ 500 ఏళ్ల వరకు మన్నిక కలిగి ఉంటాయి. అదే సిమెంట్ టైల్స్ 20 సంవత్సరాలకు మించి ఉండవు. ప్లాస్టిక్ టైల్స్‌ను ఎన్నిసార్లు అయినా తీసి మళ్లీ అమర్చుకోవచ్చు. ఒకవేళ టైల్స్ డిజైన్ నచ్చకపోతే 50 సంవత్సరాల లోపు ఎప్పుడైనా వచ్చి అదే కంపెనీకి తిరిగి ఇవ్వచ్చు. వాటిని కొత్త డిజైన్‌తో మళ్లీ టైల్స్‌ను తయారు చేస్తాం."
- దినేశ్, జాగృత్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్
టైల్స్‌ను తయారు చేయడానికి ప్రతిరోజూ రెండు టన్నుల ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారని కంపెనీ డైరెక్టర్ దినేశ్ తెలిపారు. ప్లాస్టిక్ సమస్యకు ఇది మంచి పరిష్కరమని.. ప్రభుత్వం దీనిని అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించాలని జాగృత్ డైరెక్టర్ అంటున్నారు.
ప్లాస్టిక్ బాటిళ్లతో సింథటిక్ నూలు ఉత్పత్తి, విదేశాలకు ఎగుమతి, తక్కువ ఖర్చుతో తయారీ