Makar Sankranti 2024 Arghya Vidhanam: హిందూ మతంలో మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ కొత్త పంట, కొత్త సీజన్ రాకను సూచిస్తుంది. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మకర సంక్రాంతికి రవియోగం రూపుదిద్దుకుంటోంది. ఇలాంటి పరిస్థితిలో సూర్యారాధన వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. మరి మకర సంక్రాంతి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలో ఈ స్టోరీలో చూద్దాం..
సకల చరాచర జగత్తుకు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అదిత్యుడని, భానుడని, మిత్రుడని... ఎన్నో పేర్లతో పూజలందుకుంటూ, మనలోని అజ్ఞాన తిమిరాల్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యనారాయణమూర్తి. భూమండలంపై ఏ జీవి చైతన్యంగా ఉండాలన్నా అందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి. అయితే సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈ విధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా ప్రాచుర్యం పొందింది.
మనకెన్ని పండుగలున్నా.. ఇంటింటి కాంతి సంక్రాంతే
మకర సంక్రాంతి నాడు సూర్యారాధన ప్రాముఖ్యత: కాగా, మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు ఉత్తరాయణుడు అవుతాడు. ఈ రోజున సూర్యారాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మకర సంక్రాంతి నాడు సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని.. అంతే కాకుండా విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుందంటున్నాయి.. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుందని పేర్కొన్నాయి. మరి మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే..
అన్నదాతల సంబరం.. మన సంక్రాంతి పర్వం..
మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి:
- మకర సంక్రాంతి నాడు తెల్లవారుజామున బ్రహ్మా ముహూర్త సమయంలో నిద్రలేచి స్నానం చేయాలి.
- ఈ రోజున ఎరుపు లేదా పసుపు బట్టలు ధరించాలి.
- సూర్య భగవానుని ధ్యానించి, 'సూర్య నమోస్తు' అని 21 సార్లు జపించండి.
- తర్వాత ఒక రాగి పాత్రలో నీటిని నింపాలి. ఆ నీటిలో ఎర్ర చందనం , ఎర్రటి పువ్వులు, అక్షతలు వేయాలి.
- రాగి పాత్రను రెండు చేతులతో పట్టుకుని, ఉదయించే సూర్యునికి అభిముఖంగా నిలబడాలి.
- సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి, మంత్రాలను జపించాలి.
- సూర్యునికి అర్ఘ్య సమర్పణ చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం నమో భాస్కరాయ నమః అని ప్రతి మంత్రానికి చివర అర్ఘ్య సమర్పయామి అంటూ అన్ని మంత్రాలను జపించండి.
- సూర్యునికి సమర్పించే నీరు నేలపై పడకుండా చూసుకోండి.
- పవిత్రమైన నది ఒడ్డున నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించవచ్చు. లేదా ఇంట్లో ఉన్న పూల మొక్క లేదా శుభ్రమైన పాత్రపై పడేలా చేయడం ద్వారా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు.
- సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత, అరచేతిలో నీటిని తీసుకొని మీ చుట్టూ చల్లుకోవాలి.
- అదే స్థలంలో 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత, సూర్యభగవానుడికి నమస్కరించాలి.
- అర్ఘ్యం సమర్పించిన తర్వాత, సూర్య చాలీసా, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.