పుల్వామా ఉగ్రవాద దాడికి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా..మరో భారీ ఉగ్రదాడికి ముష్కరులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్మూలోని జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీ పేలుడుకు కుట్ర పన్నిన ఓ నర్సింగ్ విద్యార్ధి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏడు కేజీల ఐఈడీ స్వాధీనం
జమ్మూలోని బస్టాండ్ ప్రాంతంలో బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. అతని నుంచి సుమారు ఏడు కేజీల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తిని పుల్వామాలోని నవా గ్రామానికి చెందిన సుహైల్ బషీర్ షాగా గుర్తించారు. పాకిస్తాన్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్ధతో సుహైల్ సంబంధాలు కల్గి ఉన్నట్లు గుర్తించారు.
మూడు చోట్ల బాంబు దాడికి కుట్ర
జమ్మూ రైల్వే స్టేషన్, బస్టాండు, రఘునాథ్ మందిర్, లఖ్‌దాతా బజార్ వద్ద పేలుళ్లు జరిపేలా అల్-బదర్ సంస్ధ అతనికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. ఇతనితో సంబంధం ఉన్న మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అటు సాంబా జిల్లా జంగ్ ప్రాంతంలో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలు, 15 చిన్న ఐఈడీలు, ఆరు పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'పుల్వామా దాడి ఇమ్రాన్ ప్రభుత్వ విజయం'