"ప్రతిరోజూ మధ్యాహ్నం చేతి మీద కూర్చుంటుంది. పెద్దపెద్దగా అరుస్తుంది. చేతిమీద కూర్చోబెట్టుకున్నాకే శాంతిస్తుంది."
- ఈస్టర్ డైమండ్ గ్రేస్, కుకూస్ సంరక్షకుడు
ముంబయిలోని గ్రేస్ కుటుంబం ఓ కాకిని పెంచుకుంటోంది. వీళ్ల కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందా కాకి. గ్రేస్ కుటుంబసభ్యులు ఈ కాకిని పెంచుకోవడం వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
"రెండున్నరేళ్ల క్రితం మా ఇంటి బాల్కనీలో ఈ కాకి మాకు దొరికింది. గాయపడి, అనారోగ్యంతో ఉంది. చికిత్స చేసి, వదిలిపెట్టాం. కానీ మరుసటిరోజు మళ్లీ వచ్చింది. మళ్లీ వదిలిపెట్టాం. అయినా తిరిగొచ్చేసింది. ఇక అప్పటినుంచీ ఎటూ వెళ్లలేదు."
- ఈస్టర్ డైమండ్ గ్రేస్, కుకూస్ సంరక్షకుడు
ఆ ఆప్యాయత మరవలేక..
ఈ కుటుంబం చేసిన సాయం, వాళ్లు చూపించిన ఆప్యాయత మరచిపోలేక.. వారితోనే కలిసి జీవిస్తోందీ కాకి. ఆ ఇంట్లోని వారందరికీ పెంచుకుంటున్న కాకి అంటే మహా ఇష్టం. ప్రేమతో దానికి కుకూ అని పేరుపెట్టి.. ఇంట్లో ఒకదానిలా చూసుకుంటున్నారు.
"దాన్ని కుకూ, చుకూ, చుచూ, షనూ బాబా అని పిలుస్తాను. యేదూ బాబా అని పిలిస్తే.. ఏదో భిన్నమైన పేరుతో పిలిచానని వెంటనే గుర్తుపట్టేస్తుంది."
- జార్జ్ గ్రేస్, కుకూస్ సంరక్షకుడు
చివరి పిల్లాడిలా భావిస్తూ..
ఇంట్లో చివరి పిల్లాడిలా ప్రత్యేకంగా చూసుకుంటారు ఈ కాకిని. గ్రేస్ కుటుంబంలోని అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. దానిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. రోజులో కుదిరినప్పుడల్లా కుకూతో గడుపుతారు.
"ఇప్పుడు ఆ కాకి మా కుటుంబంలో ఓ సభ్యురాలే. దాన్నో కాకి అని మేం ఎప్పుడూ అనుకోం. ఇంట్లో ఓ పిల్లాడిలాగే పెంచుకుంటాం. తినాలని ఏం కోరుకుంటే అదే పెడతాం. తన స్నేహితులను కలిసేందుకు ఇంటినుంచి బయటికి కూడా వెళ్తుంది. గ్యాలరీలో తనను కలిసేందుకు స్నేహితులూ వస్తారు."
- ఈస్టర్ డైమండ్ గ్రేస్, కుకూస్ సంరక్షకుడు
చక్కటి సందేశమిస్తూ..
కుకూ రాకతో గ్రేస్ ఫ్యామిలీకి స్థానికంగా భలే గుర్తింపు వచ్చేసింది. కాకిపై వాళ్లు చూపించిన ఆదరణ.. మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. మనుషుల్లాగే, జంతువులనూ ప్రేమించాలన్న సందేశాన్నిస్తోంది గ్రేస్ కుటుంబం.
ఇదీ చదవండి: 30 ఏళ్లుగా 'ఆమె' కేరాఫ్ అడ్రస్ పోలీస్ స్టేషన్!