కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ముట్టుకోవడం ద్వారా.. వైరస్ సోకుతుందనే భయంతో అనేక శవాలను అనాథల్లా వదిలేస్తున్నారు. అలాంటి వారి చివరి మజిలీ సంప్రదాయబద్ధంగా, గౌరవ ప్రదంగా ఉండాలని అనుకున్నారు ఓ మహిళ. 'నేనున్నానంటూ' ముందుకొచ్చి కొవిడ్ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర సోలాపుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త కవితా చౌహాన్. కరోనా ప్రబలినప్పటి నుంటి ఇప్పటి వరకు ఆమె సుమారు 3వేల కరోనా మృతదేహాలకు సంప్రదాయపద్ధతిలో దహనం సంస్కారాలు నిర్వహించారు.
ఎలాంటి బాధ లేదు
ఎలాంటి భయానికి లోనుకాకుండా చేపట్టే ఈ కార్యక్రమంలో తనకు మున్సిపల్ అధికారులు అండగా నిలుస్తున్నారని 'ఈటీవీ భారత్'తో చెప్పుకొచ్చారు కవిత.
"నేను చాలా దహన సంస్కారాలు చేశాను. ఇలా చేయడం వల్ల నాకు బాధ, దుఖం లాంటి ఫీలింగ్స్ కలగటం లేదు.నా సొంతవాళ్లు చనిపోయినా నేను ఏడుస్తానో లేదోనని నాకే అనుమానంగా ఉంది."
- కవితా చౌహాన్
ఇదీ చదవండి: అంత్యక్రియలకు తోపుడుబండిపైనే తల్లి మృతదేహం
గతేడాది ఏప్రిల్ 12న సోలాపుర్‌లో తొలి కరోనా మరణం వెలుగుచూసింది. ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో కొంతమంది ప్రభుత్వాధికారులు ముందడుగేశారు. ఆ తర్వాత.. కొవిడ్‌తో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ద్వారా కరోనా సంక్రమిస్తుందని, కొవిడ్ బాధితులకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా.. అంతిమ కార్యక్రమాలు చేపట్టేందుకు దాదాపు అందరూ నిరాకరించారు.
1,900 మందికి ఉచితంగా..
ఈ తరుణంలో 'నేనున్నానంటూ'ముందుకొచ్చారు కవితా చౌహాన్. ఈ కార్యక్రమంలో తనకు అండగా నిలవాలని మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తోటి సామాజిక కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా.. హిందూ శ్మశానవాటికలో ఈ బాధ్యతలు నిర్వహించడం ప్రారంభించిన కవిత.. కరోనా తొలిదశలో సుమారు 1,900 మందికి ఉచితంగా దహన సంస్కారాలు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆమె కష్టాన్ని మున్సిపాలిటీ అధికారులు గ్రహించి.. ఆ తర్వాత ఒక్కో మృతదేహానికి రూ.1,000 ఇస్తున్నారు.
ప్రస్తుతం.. దేశంలో రెండోదశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో.. ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్ కరవై రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. కొవిడ్ మృతదేహాలకు సంప్రదాయాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మనసు చాటుకుంటున్నారు కవిత.
ఇదీ చదవండి: దేశంలో వరుసగా రెండో రోజూ తగ్గిన కొవిడ్ కేసులు