కుండపోత వర్షాలు, వరదలతో మహారాష్ట్ర వణుకుతోంది. వరుణుడి బీభత్సానికి రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సతారా జిల్లాలోని మహాబలేశ్వర్, నవజా ప్రాంతాల్లో రెండు రోజుల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాతో పాటు రత్నగిరి, రాయగడ్ సహా తీర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఆయా జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
48 గంటల్లో 129 మంది మృతి
మహారాష్ట్రంలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం సహా.. వివిధ రకాల ప్రమాదాలతో గడిచిన 48 గంటల్లో మొత్తం 129 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. అందులో రాయ్‌గడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 38 మంది మరణించారు. వరదల మృతుల్లో ఎక్కువ శాతం రాయ్‌గఢ్, సతారా జిల్లాల్లోనే ఉన్నట్లు పేర్కొంది. కొండచరియలు విరిగిపడటం సహా పలువురు వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలు జరిగాయి. పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లాలోనే 27 మంది మరణించారు. అలాగే.. గోండియా, చంద్రాపుర్ జిల్లాల్లో మరణాలు అధికంగా ఉన్నాయి.
నాలుగు దశాబ్దాల రికార్డ్...
సతారా జిల్లాలోని మహాబలేశ్వర్‌లో రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 594 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. చివరిసారిగా అక్కడ 1977 జులై 7న 439.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వెల్లడించింది.
రత్నగిరి జిల్లాలోని చిప్లన్లో 300 ఎమ్ఎమ్కిపైగా వర్షపాతం రికార్డయింది. అదే జిల్లాలోని మహద్ తహసీల్ పరిధిలో 305 మిల్లీమీటర్లు నమోదైంది. చిప్లన్లో గడిచిన 40 ఏళ్లలోనే అతిభారీ వర్షాలుగా పేర్కొన్నారు రంగైరి కలెక్టర్ బీఎన్ పాటిల్.
24 గంటల్లో 204.4 ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైతే.. దానిని అతిభారీ వర్షాలుగా పరిగణిస్తారు.
ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఇప్పటికే వర్షాలతో తడిసి ముద్దయిన ఆరు జిల్లాలకు.. భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు ఉందని అంచనా వేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్, పుణె, కొల్హాపుర్, కొంకణ్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.
ఇల్లు కూలి నలుగురు మృతి
తూర్పు ముంబయి గోవండి ప్రాంతంలోని శివాజీ నగర్లో ఓ ఇల్లు కూలిపోయి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బాంబే సిటీ ఆసుపత్రి సమీపంలోని ప్లాట్ నంబర్ 3 వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఏడు అగ్నిమాపక యంత్రాలు, రెస్క్యూ వ్యాన్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.
నదిలో కొట్టుకుపోయిన బస్..
కొల్హాపుర్ జిల్లాలో శుక్రవారం ఓ బస్సు నది దాటుతుండగా కొట్టుకుపోయింది. వరదలో బస్సు చిక్కుకున్న సమయంలో ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. భుదర్గాడ్ తహసీల్ పంగైర్ గ్రామంలో తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చికోడి నది వంతెనపై నుంచి వరద ప్రవహిస్తున్నా.. పట్టించుకోకుండా దాటేందుకు ప్రయత్నించాడు డ్రైవర్. వరద ప్రవాహాన్ని తట్టుకోలేక అందులో కొట్టుకుపోయింది బస్సు.
మహద్ వరదలపై సీఎం సమీక్ష..
రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో వరద పరిస్థితులపై సమీక్షించారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. కొండచరియలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయిన ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సహాయక బృందాలు ఓ హెలికాప్టర్ సహాయంతో వరదల్లో చిక్కుకుంటున్న వారిని రక్షిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి నివేదించారు. మహద్ రోడ్, మంగావూన్ మహద్ హైవే, గోర్గావూన్ దపోలి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించినట్లు తెలిపారు.
ఠాక్రేకు అమిత్ షా ఫొన్..
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఫొన్లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వరద పరిస్థితులు, రాయ్‌గఢ్ ప్రమాదంపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాల సాయం ఉంటుందని భరోసా కల్పించారు.
" భారీ వర్షాలతో రాయ్‌గడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ప్రమాదం జరిగిన ఘటన దురదృష్టకరం. ఈ నేపథ్యంలో.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్డీఆర్ఎఫ్హెచ్క్యూ డీజీతో మాట్లాడాను. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సాయం అందిస్తుంది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్రం రూ.5 లక్షలు
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రూ.2 లక్షల సాయం ప్రకటించారు. భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, కేంద్రం నుంచి అన్ని విధాల సాయం అందిస్తామన్నారు. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. గాయపడిన వారికి రూ.50వేలు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'మహా' విషాదం- కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి