Shivsena Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభనకు కేంద్ర బిందువుగా మారిన శివసేన శాసనసభ్యుడు, కేబినెట్ మంత్రి ఏక్నాథ్ శిందేపై ఆ పార్టీ కొరడా ఝుళిపించింది. ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌లో మకాం వేసిన ఆయన్ను.. శాసనసభా పక్షనేత హోదా నుంచి తొలగించింది. శివాడీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నూతన పార్టీ సభా పక్షనేతగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
Eknath Shinde news: మరోవైపు, అధికారం కోసం తాను మోసం చేయనని ఏక్నాథ్ శిందే అన్నారు. తాజా సంక్షోభం నేపథ్యంలో తొలిసారి స్పందించిన ఆయన.. బాల్ ఠాక్రే బోధనలను తాను వదిలిపెట్టబోనని చెప్పుకొచ్చారు. "బాలాసాహెబ్‌కు మేం విధేయులమైన శివసైనికులం. ఆయనే మాకు హిందుత్వ పాఠాలు బోధించారు. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే పాఠాలను మరిచిపోం" అని మరాఠీలో ట్వీట్ చేశారు. శాసనసభా పక్షనేత హోదా నుంచి తప్పించిన నేపథ్యంలో.. ట్విట్టర్ బయో నుంచి 'శివసేన' అన్న పదాన్ని శిందే తొలగించారు.
12 మంది ఎమ్మెల్యేలతో శిందే సూరత్‌లోని ఓ హోటల్లో ఉంటున్నారు. అయితే, ఎమ్మెల్యేల సంఖ్యపై స్పష్టత లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరు కూడా శిందేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ వార్తలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. 'శివసేన.. విధేయుల పార్టీ. భాజపా చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో విఫలమైనట్టుగానే.. అఘాడీ ప్రభుత్వాన్నీ ఎవరూ కూల్చలేరు. శిందే నమ్మకస్తుడైన శివసైనికుడు. మిస్సింగ్ ఎమ్మెల్యేలను సంప్రదిస్తే వారు తిరిగి వస్తారు' అని పేర్కొన్నారు.
'నా భర్తను వెతికిపెట్టండి'
శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించకుండా పోయారని కంప్లైంట్ ఇచ్చారు. సోమవారం రాత్రి నుంచి ఆయన్ను సంప్రదించలేకపోతున్నానని చెప్పారు. వెంటనే ఆయన్ను కనిపెట్టాలని కోరారు.
ఏదైనా జరగొచ్చు: భాజపా
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో పరిస్థితిపై ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిందే తమకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని అన్నారు. 'ఇప్పుడే ఏదైనా చెప్పడం తొందరపాటు అవుతుంది. మేం వేచి చూస్తున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్నాథ్ శిందే నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. భాజపా కూడా ఆయనకు ఎలాంటి ప్రపోజల్ పంపలేదు. కానీ, రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు' అని పాటిల్ చెప్పుకొచ్చారు.
'మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న మూడో ప్రయత్నమిది' అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అయితే, ఈ సవాలును ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమర్థంగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే భాజపాతో జట్టుకట్టే అవకాశమే లేదన్నారు. 'దిల్లీలో విపక్షాల భేటీ పూర్తవగానే ముంబయికి వెళ్తా. ఠాక్రేతో సమావేశమవుతా. కూటమిలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. ఠాక్రే నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక గురించి ఏక్నాథ్ ఏనాడూ మాతో చెప్పలేదు. ఇది ఆ పార్టీ అంతర్గత విషయం. పరిస్థితిని సమీక్షించి వారే మాకు సమాచారం ఇస్తారు. మా పార్టీ మద్దతు శివసేనకు ఉంటుంది' అని పవార్ వివరించారు.
ముప్పేమీ లేదు: కాంగ్రెస్
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సైతం అఘాడీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అభిప్రాయపడింది. సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను మహారాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిగా నియమించింది.
ఇదీ చదవండి: ఉద్ధవ్ సర్కార్‌కు షాక్.. మంత్రి తిరుగుబాటు.. 15 మందికిపైగా ఎమ్మెల్యేలతో జంప్?