Maharashtra Online Fraud: ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులమని చెప్పి ఓ యువతిని దారుణంగా మోసం చేశారు ఇద్దరు వ్యక్తులు. లోన్ ఇప్పిస్తామని చెప్పి రూ. 14 లక్షలు కాజేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఇదీ జరిగింది..
మహారాష్ట్రకు చెందిన ఓ యువతి(22) బ్యాంక్ ఖాతాలో తన తండ్రి రూ.18 లక్షలు డిపాజిట్ చేశాడు. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బును కుమార్తెకు ప్రేమతో ఇచ్చేశాడు. అయితే.. కొద్దిరోజుల తర్వాత ఈ మొత్తం సొమ్ములో యువతి దాదాపు రూ. లక్ష వరకు ఖర్చు చేసింది.
అనంతరం లక్ష రూపాయలు లోన్ తీసుకుని మళ్లీ ఆ డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ఆలోచించింది యువతి. ఈ క్రమంలో జులై 24న ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తానని చెప్పి లోన్ ఇప్పిస్తానని అన్నాడు. ఇది నిజమే అని భావించిన యువతి రూ. 2,600 ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించింది.
కరోనా సోకిందని..
కొద్ది రోజులకు మరో వ్యక్తి ఫోన్ చేసి.. తొలుత మాట్లాడిన ఏజెంట్‌కు కొవిడ్ సోకిందని యువతితో చెప్పాడు. లోన్ వచ్చేందుకు ఆలస్యమవుతుందని అన్నాడు. మళ్లీ ప్రాసెసింగ్ చేసేందుకు డబ్బు చెల్లించాలని తన వద్ద నుంచి దాదాపు రూ. 14. 47 లక్షలు కాజేశాడు. జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో పలుమార్లు ఈ మొత్తాన్ని యువతి నుంచి తీసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత తాను మోసపోయిందని తెలుసుకున్న యువతి.. పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా వివరించింది. సెక్షన్ 420 కింద్ ఛీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రాజ్ కుండే, అంజుమన్ షాగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: