మహారాష్ట్ర ముంబయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబయిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 25 మంది మృతి చెందారు. చెంబుర్ ప్రాంతంలోని భరత్ నగర్ కాలనీలో ఓ ప్రహరీ గోడ కూలి గుడిసెలపై పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మిక్రోలిలో భవనం కూలి ఏడుగురు చనిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు జరిగాయి.
భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడగా.. గోడ కూలిందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి ముంబయి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 16 మందిని రక్షించారు. మరో ఏడుగురు గాయపడగా... సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
విక్రోలిలో మరో ఘటన..
ముంబయిలోని విక్రోలి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఆరు గుడిసెలు కూలాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం ఉదయం 2:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని.. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
భాండుప్లో బాలుడు మృతి..
ముంబయి భాండుప్లో అటవీ శాఖకు చెందిన ప్రహరీ గోడ కూలి.. ఓ 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని ఓ అధికారి తెలిపారు.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం..
మంబయి ప్రమాదాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2లక్షలను పరిహారంగా అందిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50,000 సాయం అందిస్తామని తెలిపింది.
రాష్ట్రపతి సంతాపం..
ముంబయి చెంబుర్, విక్రోలిలో జరిగిన ప్రమాదాలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
పరిహారం ప్రకటించిన ఠాక్రే ప్రభుత్వం
ఈ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం చేయిస్తాన్నారు.
సబర్బన్ రైలు సర్వీసులు బంద్
శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంబయిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ప్రభావంతో పలు చోట్ల రహదారి మార్గాలు దెబ్బతిన్నాయి. పట్టాలపైకి నీరు చేరగా.. ముంబయి సబర్బన్ రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.