కాంగ్రెస్-ఏఐయూడీఎఫ్ కూటమితో అప్రమత్తంగా ఉండాలని అసోం ప్రజలను హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పేర్కొన్నట్టుగా అది మహా కూటమి కాదని.. అదంతా పెద్ద అబద్ధం అని ఎద్దేవా చేశారు. లఖ్మిపూర్ జిల్లాలోని బిహూపుర్లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఓట్ల కోసం కాంగ్రెస్ ఎదైనా చేస్తుంది, ఎవరినైనా మోసం చేస్తుంది. సరైన నేతలు లేని కాంగ్రెస్‌కు నైతికత కూడా లేదు. అసోంలో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపిన ఆ పార్టీ.. కేరళలో వారిని విమర్శిస్తోంది. ప్రస్తుతం అసోంలో అభివృద్ధి కనిపిస్తోంది. చొరబాటుదార్లకు అవకాశమే లేదు. అసోం ప్రత్యేకతను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఏఐయూడీఎఫ్‌తో ఆ పార్టీ చేతులు కలిపింది. చోరబాట్లను ప్రోత్సహించే వారి సాయాన్ని కాంగ్రెస్ కోరుతోంది. అటువంటి కూటమి చొరబాట్లు, అవినీతికి దారితీస్తుంది. మీకు అసోం సంప్రదాయాలను నాశనం చేసుకోవాలని ఉందా?"
-నరేంద్ర మోదీ, ప్రధాని
దుష్ప్ర చారం చేస్తోంది..
కాంగ్రెస్ హయాంలో టీ కార్మికుల వేతనాలను కనీసం రూ.100కు కూడా పెంచలేదని, ఆ పార్టీనే ఇప్పుడు దుష్ప్రచారాలు చేస్తోందని మోదీ విమర్శించారు. ఎన్డీఏ హయాంలో వారి వేతనాలను ఐదేళ్లలో రెండింతలు చేశామని చెప్పారు. అధికారం చేపట్టాక టీ కార్మికుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : 'ఔట్‌సైడర్స్'పై మోదీ, దీదీ మాటల యుద్ధం