మహారాష్ట్రలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 136కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. రాయ్‌గఢ్ జిల్లా మహర్ తాలుకా తలాయి గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 44కి పెరిగింది.
అక్కడ సుమారు 30 ఇళ్లు ఉండగా బండలు పడటం వల్ల ఆ గ్రామం తుడిచిపెట్టుకు పోయింది. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన 35 మంది ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారని.. రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 6 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.
సుమారు 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని.. అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు.. చెప్పారు.
సీఎం పర్యటన..
వరద ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. హెలికాప్టర్లో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మహర్, తలాయి గ్రామంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'మహా' విషాదం- కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి