దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల టీకా డోసుల పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అందుకుంది. అయినా.. కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సంబంధిత సంస్థలు. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని సిబ్బందికి జీతాలు చెల్లించబోమని ప్రకటించింది మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ). ఠాణె మేయర్ నరేశ్ మస్కే.. సీనియర్ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నిర్దేశిత సమయంలో రెండు డోసు అందుకోనివారికి కూడా వేతనాలు చెల్లించేది లేదని తాజా ప్రకటనలో పేర్కొంది టీఎంసీ. సిబ్బంది తప్పనిసరిగా టీకాలు తీసుకుని.. వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలను సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నెలాఖరుకు నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంలో భాగంగా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు మస్కే తెలిపారు.
లక్ష్యాన్ని సాధించే దిశగా నగర పౌరులు సహకారం అందించాలని కోరారు మేయర్ నరేశ్. తప్పని సరిగా ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి డ్యాన్స్.. వీడియో వైరల్