మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి అవమానం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఉత్తరాఖండ్, ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రీ అకాడమీలో జరగనున్న ఐఏఎస్ అధికారుల శిక్షణా కార్యక్రమానికి గవర్నర్ హాజరు కావాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
ఎక్కిన తర్వాత కూడా..
ప్రభుత్వ విమానం కోసం అనుమతి కోరుతూ ఫిబ్రవరి 2నే ప్రభుత్వానికి గవర్నర్ సెక్రటరీ లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం ఈ విషయంపై సమాచారం ఇచ్చామని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. ఉదయం పది గంటలకు ముంబయి విమానాశ్రయానికి గవర్నర్ తన సహాయకులతో కలిసి వెళ్లారు. ప్రభుత్వ విమానాన్ని ఎక్కిన తర్వాత కూడా అనుమతులు లేవని నిరాకరించారు. దీనికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
తప్పని స్థితిలో వేరే కమర్షియల్ ఫ్లైట్‌లో గవర్నర్ ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌కు వెళ్లారు.
ప్రభుత్వ స్పందన..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను ఈ విషయంపై అడగగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు. సమాచారం తెలుసుకొని చెబుతానని అన్నారు.
చిన్నపిల్లల చేష్టలు..
ఈ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా మండిపడింది. ప్రభుత్వ అహంకారానికి ఈ చర్య అద్దం పడుతోందని ఆరోపించింది. ప్రభుత్వానివి చిన్నపిల్లల చేష్టలని దుయ్యబట్టింది. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది
ఇదీ చదవండి:'బాంబే హైకోర్టు తీర్పు' సవాల్ పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే