Madurai High Court on Paternity Leave Rules : భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్తకు పితృత్వ సెలవులు మంజూరు చేయాలని అభిప్రాయపడింది మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్. ఈ సెలవుల మంజూరు కోసం నిర్దిష్టమైన చట్టాలు సైతం ఉండాలని సూచించింది. తెంకాసి జిల్లాలోని కడయం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి.. ఇన్స్పెక్టర్కు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.
Paternity Leave in India : భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్త పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని మదురై బెంచ్ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గర్భవతిగా ఉన్న సమయంలో తల్లితో పాటు తండ్రికి సెలవులు ఇస్తున్నారని బెంచ్ గుర్తు చేసింది. చిన్నారుల పెంపకంలో తల్లితో పాటు తండ్రి పాత్ర చాలా ముఖ్యమని పేర్కొంది. భారత్‌లో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం పితృత్వ సెలవులు ఇవ్వాల్సి ఉన్నా.. అనేక రాష్ట్రాలు వాటిని పాటించడం లేదని చెప్పింది. నిర్దిష్టమైన చట్టాలు, నిబంధనలు లేవని.. అందుకోసమే ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని సూచించింది. జ్ఞానం, రక్షణ, మద్దతు అందించే వ్యక్తిని తండ్రిగా నిర్వచించిన కోర్టు.. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త పక్కనే ఉండాలని చెప్పింది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో పితృత్వ సెలువులపై చర్చ నడవడం మంచి పరిణామంగా భావించింది. తల్లీబిడ్డల సంరక్షణ, ఆరోగ్య విషయంలో భర్త పాత్ర ముఖ్యమని.. తల్లితో పాటు తండ్రికి సైతం సమానంగా సెలవులు మంజూరు చేసేలా చట్టాలను రూపొందించాలని అభిప్రాయపడింది.
ఇదీ జరిగింది
శరవణన్ అనే వ్యక్తి కడయం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆర్టిఫీషియల్ ఇన్సెమినేషన్ పద్ధతిలో గర్భం దాల్చడం వల్ల సెలవులు పెట్టారు శరవణన్. మొదట సెలవులు మంజూరు చేసిన ఉన్నతాధికారులు.. ఆ తర్వాత శాంతి భద్రతల కారణాన్ని చూపిస్తూ రద్దు చేశారు. శరవణన్ సెలవులు రద్దు చేసినా.. విధులకు హాజరు కాకపోవడం వల్ల ఆయనకు నోటీసులు జారీ చేశారు అధికారులు. తనకు నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకించిన శరవణన్.. మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఇలా తీర్పునిచ్చింది.