తమిళనాడులో రిజర్వేషన్లకు సంబంధించి మధురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. అక్కడి వన్నియార్ సామాజిక వర్గానికి 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. ఈ మేరకు దానిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక కేసు తీర్పు సందర్భంగా కీలక ప్రశ్నలు వేసింది ఉన్నత న్యాయస్థానం. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వవచ్చా? లేదా? అని నిలదీసింది.
వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం చట్టాన్ని చేయగా.. ప్రస్తుత డీఎంకే సర్కార్ దానిని అమలు చేసింది. అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీ) 20 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తుండగా.. వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రస్తుత చట్టాన్ని రూపొందించారు.
అయితే దీనిని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంబీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని.. వన్నియార్లకు 10.5 శాతం కేటాయించడం వల్ల ఎంబీసీ డీనోటిఫైడ్ వర్గానికి (డీఎన్సీ) చెందిన పలువరి అవకాశాలు ప్రభావితం అవుతాయని పిటిషనర్లు వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. 10.5 శాతం రిజర్వేషన్లను కొట్టేసింది. కులాలవారీ గణన లేకుండా ఈ తరహా రిజర్వేషన్లు అమలు చేయవచ్చా అని ప్రశ్నించింది.
దీనిపై స్పందించిన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్.రామదాస్ కోర్టు తీర్పు దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటాల అనంతరం తమకు రిజర్వేషన్లు లభించాయని.. ముస్లింలు, అరుంథతియార్లకు ఉన్న అంతర్గత రిజర్వేషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించలేదని గుర్తుచేశారు.
"వన్నియార్ సామాజిక వర్గానికి ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. రిజర్వేషన్ల ఆధారంగా అనేక మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇంకొందరు ఉద్యోగాలు పొందారు. అందువల్ల కోర్టు తీర్పుపై వెంటనే అప్పీల్ చేస్తాం"
-ఎస్.రామదాస్
ఇవీ చదవండి: