మధ్యప్రదేశ్.. బెతుల్ జిల్లాలో 400 అడుగుల లోతైన బోర్‌బావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు తన్మయ్‌ను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మూడు రోజులుగా కొనసాగుతోంది. సహాయక చర్యలు ఇంకా పూర్తికాకపోవడం వల్ల బాలుడి కుటుంబసభ్యులు కన్నీమున్నీరవుతున్నారు. త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలని, తమ బిడ్డను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ గురించి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదని బాలుడి తల్లి జ్యోతి సాహు ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ఆ ప్రాంతానికి వెళ్లడానికి కూడా తమను అనుమతించడం లేదని తెలిపింది. ఇదే ఒక రాజకీయ నాయకుడు లేదా అధికారి బిడ్డ అయితే ఇంత సమయం పట్టేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. "అడుగుతున్న ప్రతిసారీ మరో నాలుగు గంటల్లో ఆపరేషన్ పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. తన బిడ్డను కడసారి చూడాలనుకంటున్నాను. త్వరగా బయటకుతీయండి" అంటూ కన్నీరుమున్నీరవుతోంది.
బెతుల్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శ్యామేంద్ర జయస్వాల్ బాలుడి రెస్క్యూ ఆపరేషన్‌పై అప్డేట్ ఇచ్చారు. "45 అడుగుల తవ్వకాన్ని పూర్తి చేశాం. బోరుబావికి సమానంగా సొరంగం తవ్వుతున్నాం. పెద్దపెద్ద రాళ్లు ఉండడం వల్ల అవి విరిగి ఆపరేషన్‌కు అడ్డువస్తున్నాయి. అది చాలా క్లిష్టమైన ప్రాంతం. జాగ్రత్తగా తవ్విస్తున్నాం. వేగంగా బాలుడిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు.
తన్మయ్ సురక్షితంగా బయటకు రావాలని.. అతడు చదువుతున్న పాఠశాలలో విద్యార్థులందరూ గాయతీ మంత్రాన్ని జపిస్తున్నట్లు టీచర్ గీతా మాన్కర్ తెలిపారు.
ఇదీ జరిగింది..
మండి గ్రామానికి చెందిన తన్మయ్.. డిసెంబర్ 6న సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో చూసుకోకుండా బోరుబావి వైపు పరిగెత్తాడు. ఒక్కసారిగా అందులో పడిపోయాడు. అది చూసిన తన్మయ్ అక్క.. వెంటనే కుటుంబసభ్యులకు తెలిపింది. స్థానిక అధికారులకు తన్మయ్ తల్లిదండ్రులు సమాచారం అందించారు. బోరుబావిలో బాలుడు పడిపోయిన గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరుబావిలో బాలుడికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపులు పంపించారు.
బాలుడి చేతిని తాడుతో కట్టి లాగే ప్రయత్నం కూడా చేశారు అధికారులు. 12 అడుగుల వరకు బాలుడు బాగానే పైకి వచ్చినప్పటికి ఆ తరువాత తాడు తెగిపోయింది. దీంతో మరో మార్గం ద్వారా బాలుడిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాలుడితో తండ్రి మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆ సమయంలో తండ్రితో మాట్లాడిన బాలుడు "ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది నాన్న.. నన్ను త్వరగా బయటకు తీయండి" అని అన్నాడు. అనంతరం కొద్దిసేపటికే ఎటువంటి స్పందన బాలుడి నుంచి రాలేదు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు నాయకులు చిన్నారి క్షేమం కోసం కోరుతూ ట్వీట్లు చేశారు.