Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 15 మంది కూలీలు మరణించారు. మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి తరువాత జరిగిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా యూపీ, బిహార్‌కు చెందినవారని వెల్లడించారు. దీపావళి పండుగ కోసం తమ స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ నుంచి లఖ్‌నవూకు ప్రయాణికులతో శుక్రవారం.. బస్సు బయలుదేరింది. జబల్పుర్ నుంచి ప్రయాగరాజ్ వెళ్తున్న సమయంలో బస్సు ముందు వెళ్తున్న ట్రక్కు మొదట ఓ గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు ముందు భాగంలో కూర్చున్నవారు మృత్యువాత పడ్డారు.
ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
సీఎం యోగి సంతాపం..
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, ప్రమాద విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై యూపీ సీఎంకు ఫోన్ చేసి వివరించారు. చనిపోయిన వారి మృతదేహాలను ప్రయాగ్‌రాజ్‌కు తరలిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇవీ చదవండి: