పునర్వినియోగ రాకెట్ పరిజ్ఞానం విషయంలో మన దేశం పట్టు సాధించాల్సిన అవసరం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ జి. మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెటింగ్‌ను మరింత ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్పేస్‌వాక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అనుసరించిన వ్యాపార నమూనా నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి, అంతర్జాతీయ మార్కెట్లో అంతరిక్ష సంబంధ సేవలను అందించడానికి భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. "భూ పరిశీలన, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవరసరమైన ప్రాథమిక పరిజ్ఞానం, సామర్థ్యం మనకు ఉంది. అయినా అంతర్జాతీయ మార్కెటింగ్‌లో అవకాశాలను సరిగా అందిపుచ్చుకోలేకపోతున్నాం." అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే 30-40శాతం మేర తక్కువ ధరలకు భారత్ ఉపగ్రహ ప్రయోగ సర్వీసులను అందిస్తోందన్నారు.
ఇలాంటి సామర్థ్యం లేని దేశాల్లో మరిన్ని అవకాశాలను ఒడిసిపట్టేందుకు వీలుందని చెప్పారు. అందువల్ల దూకుడుగా వ్యవహరించి, మన మార్కెట్ వాటాను పెంచుకోవాలని సూచించారు. పునర్వినియోగ రాకెట్ వ్యవస్థ ద్వారా అంతరిక్ష పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులకు మస్క్ శ్రీకారం చుట్టారని మాధవన్ నాయర్ చెప్పారు. ఇలాంటి సాంకేతికత గురించి 15-20 ఏళ్లుగా భారత్ యోచిస్తున్నప్పటికీ పురోగతి పెద్దగా లేదన్నారు. అంతరిక్ష ప్రయోగ సేవల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, వాటిని భారత్ అందిపుచ్చుకోవాలని కోరారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ తరహాలో మస్క్లోనూ అద్భుత దార్శనికత ఉందన్నారు.