ఉద్రిక్తతల అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను(priyanka gandhi latest news ) ఆగ్రా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్న అనంతరం కాసేపటికి నలుగురు వెళ్లేందుకు అంగీకారం తెలిపారు. దీంతో ప్రియాంకతో మరో నలుగురు ఆగ్రా వెళ్తున్నారు.
ఉద్రిక్తతలు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ దొంగతనం కేసులో అరెస్టయిన పారిశుద్ధ్య కార్మికుడు పోలీస్ కస్టడీలోనే మరణించాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక ఆగ్రా వెళ్తున్నారు(priyanka gandhi news today). అయితే అక్కడకు వెళ్లేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ నుంచి ఆదేలున్నాయని, ప్రియాంకను యూపీ పోలీసులు తొలుత అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు భారీగా తరలిరావడం వల్ల కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. ఆ తర్వాత ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి విడిచిపెట్టారు.
ప్రియాంక అసహనం..
పోలీసుల తీరుపై ప్రియాంక (priyanka gandhi lucknow) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను లఖ్‌నవూ నుంచి ఎక్కడకు బయల్దేరినా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు(priyanka gandhi news). తాను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు తప్ప మరెక్కడికీ వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. పదే పదే తనను రోడ్డుపై అడ్డుకోవడం వల్ల ప్రజలకు కూడా అసౌకర్యం కలుగుతుందని అన్నారు.
" లఖ్‌నవూ నుంచి బయటకు వెళ్లే ప్రతిసారి నేను ఇతరుల అనుమతి తీసుకోవాలా? నన్ను ఆగ్రా వెళ్లేందుకు ఎందుకు అనుమతించడం లేదు? శాంతి భద్రతల సమస్య ఏమైనా ఉందా? ఒకరు చనిపోతే అది శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుంది? కలెక్టర్‌కు ఫోన్ చేసి అడగండి. నేను లఖ్‌నవూలో గెస్ట్ హౌస్‌లోనే ఉండాలా? ఎక్కడకూ వెళ్లొద్దా? చాలా అతి చెేస్తున్నారు."
-ప్రియాంకా గాంధీ వాద్రా.
రూ.25లక్షల చోరీ కేసు..
ఆగ్రా జగదీశ్పుర పోలీస్ స్టేషన్లో పోలీసులకు సంబంధించిన వస్తువులు ఉండే మాల్‌ఖానాలో రూ.25లక్షల దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీస్ సిబ్బందిని ఏడీజీ సస్పెండ్ చేశారు. మాల్‌ఖానాలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అక్కడే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నిందితుడు అరుణ్‌ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీస్ కస్టడీలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే దొంగతనం చేసింది తానే అని అరుణ్ విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు. అతడిచ్చిన సమాచారం మేరకే అతని ఇంట్లో రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇంట్లో సోదాలు జరుగుతున్న సయమంలోనే అరుణ్ ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు తెలిసిందని పేర్కొన్నారు.
పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అరుణ్ కస్టడీలో మరణించాడని ప్రియాంక గాంధీ ఆరోపించారు. చనిపోయేలా కొట్టడం ఏం న్యాయమని ప్రశ్నించారు. వాల్మీకి జయంతి రోజే యూపీ పోలీసులు ఆయన సందేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ కుబుంటాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా... పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
అరుణ్ మృతిపై వాల్మీకీ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలన డిమాండ్ చేసింది.
యూపీ మాజీ సీఎం మాయావతి కూడా ఈ ఘటనను ఖండించారు. పోలీసు కస్టడీలో పారిశుద్ధ్య కార్మికుడు మరణించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విమానంలో నటిపై వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్