దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహా ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ప్రియురాలిని కత్తితో ముక్కలుగా నరికి హతమార్చాడు ఆమె ప్రియుడు. అనంతరం ఆమె శరీర భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన నిందితుడు.. మృతురాలి శరీర భాగాలను విసిరేసిన ప్రదేశాలను చూపించాడు. మృతురాలి ఎముకలు, దవడ భాగం, వెంట్రుకలు పోలీసులకు లభ్యమయ్యాయి. మిగతా భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి స్వగ్రామంలోని బావిలో మృతురాలి శరీర భాగాలను కోసం గాలింపు చేపట్టారు. జనవరి 22న జరిగిందీ ఘటన. మృతురాలిని గుడ్డిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
జనవరి 22న గుడ్డి అనే మహిళ ముండాసర్లో ఉన్న తన అత్తవారింటికి వెళ్తానని బయలుదేరింది. ఆ రోజు అత్తమామల ఇంటికి చేరుకోలేదు. అలా అని తన పుట్టింటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. రెండు రోజుల తర్వాత జనవరి 24న శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో గుడ్డి.. ఆమె ప్రియుడు అనోపారం అనే వ్యక్తితో బైక్‌పై నాగౌర్ వైపు వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అనోపారంను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. గుడ్డి తనను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడం వల్లే హత్య చేశానని ఆమె ప్రియుడు అనోపారం పోలీసులకు తెలిపాడు.
చిన్నారి హత్య కేసులో మరణశిక్ష..
ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ కేసులో నిందితుడికి గాజియాబాద్ పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడు సోనూకు మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబరు 1న జరిగిన మైనర్‌పై జరిగిన ఆకృత్యం జరిగింది. రెండు నెలల వ్యవధిలోనే కోర్టు.. నిందితుడికి శిక్షను ఖరారు చేసింది.
నడుస్తున్న రైలు నుంచి
కేరళ కోజీకోడ్‌లో దారుణం జరిగింది. నడుస్తున్న రైలు నుంచి తోటి ప్రయాణికుడిని తోసేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో అసోంకు చెందిన ప్రయాణికుడు మరణించాడు. వడసిర వద్ద కన్నూర్-ఎర్నాకులం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన. రైలులో గొడవ జరగడం వల్లే ప్రయాణికుడిని నిందితుడు ఇస్లాం కిందకి తోసేసినట్లు ప్రయాణికులు తెలిపారు. రైల్వే పోలీసులు నిందితుడు ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్మీ ర్యాలీ కోసం ప్రాక్టీస్ చేస్తూ మృతి
ఉత్తరాఖండ్ ఫితౌరాగఢ్లో హృదయవిదారక ఘటన జరిగింది. ఆర్మీ ర్యాలీకి సిద్ధమవుతున్న ఓ యువకుడు మైదానంలో పరిగెడుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అతడి స్నేహితుడు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరాస్(18) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.