Longest Hair In The World Female 2023 : ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్మితా శ్రీవాస్తవ. ఆమె జుట్టు పొడవు 7 అడుగుల 9 అంగుళాలు. స్మితా పొడవాటి జుట్టుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇప్పటికే చోటు దక్కింది. 1980ల నాటి హీరోయిన్ల స్ఫూర్తితో ఇలా 30 ఏళ్లుగా ఆమె జుట్టు పెంచుతున్నారట.
'నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు టీవీలో సినిమాలు, పాటలు చూసేదాన్ని. అప్పటి హీరోయిన్లు అయిన జయా భాదురీ, రేఖకు చాలా అందమైన పొడవాటి, జుత్తు ఉండేది. 1980ల్లో వచ్చిన సినిమాల్లో వీళ్లను ఇలా చూసేవాళ్లం. అప్పటినుంచి నాకు కూడా పొడవైన జుట్టు ఉంటే బాగుండు అనిపించేది. వీళ్లను చూసే నేను కూడా జుట్టును పెంచాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ, సోదరి కూడా అందమైన, పొడవైన జుట్టును కలిగి ఉన్నారు' అని చెబుతున్నారు గిన్నిస్ రికార్డ్ సాధించిన స్మితా శ్రీవాస్తవ.
ఇంతటి పొడవాటి జడను జాగ్రత్తగా చూసుకోవడం అంత సులువేమీ కాదు. జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచుకునేందుకు సహజ పద్ధతులనే పాటిస్తానని చెబుతున్నారు స్మిత.
"నా జుట్టు సంరక్షణ కోసం సహజ ఉత్పత్తులనే వినియోగిస్తాను. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఉసిరి, కుంకుడు, మెంతులు, నల్ల జీలకర్రను తెచ్చుకుంటాను. వీటన్నింటినీ పొడి చేసి ఓ గిన్నెలో నానబెడతాను. ఆ మిశ్రమాన్ని 2-3 గంటల వరకు జుట్టుకు రాసి ఉంచుతాను. చివరగా గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుతాను. హెయిర్ కండీషనింగ్ కోసం గోరింటాకు వాడతాను."
- స్మితా శ్రీవాస్తవ
పలు వైద్య కారణాలతో 2012లో స్మితా తన జడను కత్తిరించుకోవాల్సి వచ్చింది. అయినా భర్త, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తిరిగి జుట్టు పెంచడం ప్రారంభించారు.
"జుట్టు పెంచే విషయంలో స్మితాకు మేము ఎప్పుడూ మద్దతుగా నిలిచాము. అవసరమైనప్పుడల్లా ఆమెకు మార్గనిర్దేశం చేశాము. అంతేతప్ప ఇందులో మా పాత్ర ఏమీ లేదు. చెప్పిన సూచనల్ని పాటించేది. అందుకే ఈరోజు గొప్ప రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది.
ప్ర: ఈ పొడవైన జుట్టు కోసం స్మితా చాలా కష్టపడ్డారా?
జ : అవును, చాలా కష్టపడింది.
ప్ర: మీ భార్య ఇలా పొడవాటి జుట్టును పెంచడం మీరు ఎంత కాలంగా చూస్తున్నారు?
జ : గత 20-22 ఏళ్లుగా ఆమె జుట్టు పెంచడాన్ని చూస్తున్నాము."
- సుదేశ్ శ్రీవాస్తవ, స్మిత భర్త
'మా అమ్మ ఓ పెద్ద రికార్డును అందుకుంది. స్కూల్లో చాలామంది స్నేహితులు మీ అమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డును ఎలా సాధించారు అని అడుగుతుంటారు. ఇంతటి పొడవైన జుట్టును తను ఎలా పెంచారు, ఎన్ని ఏళ్ల నుంచి తను ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తారు. ఎప్పటి నుంచి మీ అమ్మ జుట్టును కత్తిరించడం లేదు అని కూడా అడుగుతారు' అని అంటున్నాడు స్మితా కుమారుడు సరస్వత్ శ్రీవాస్తవ.
ఇక ఇప్పటినుంచి రాలిన జుట్టు సేకరించి, క్యాన్సర్ రోగుల కోసం విగ్గులు చేయించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు స్మిత.