assisted reproductive technology bill: సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా సింగిల్ పేరెంట్స్, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలు ఈ ప్రక్రియను వినియోగించటం నుంచి మినహాయించొద్దని ప్రభుత్వాన్ని కోరారు పలువురు సభ్యులు. అలాగే, సరోగసిపై బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. మరో రెండు డ్రాఫ్ట్ చట్టాలు సహా అన్నింటిని ఒకేసారి ఆమోదించాలని కోరారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్.. సరోగసి బిల్లుపై ఆదారపడి ఉందని తెలిపారు ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్.
" సరోగసి బిల్లు ఎగువ సభలో పెండింగ్లో ఉంది. ఇంకా ఆమోదం పొందలేదు. ఒక చట్టంపై ఆదారపడిన మరో బిల్లును ఈ సభ ఎలా ఆమోదిస్తుంది? ఈ బిల్లును పరిగణనలోకి తీసుకోలేమనేది నా పాయింట్. "
- ఎన్కే ప్రేమంచంద్రన్, ఆర్ఎస్పీ నేత
ఆర్ఎస్పీ నేత ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా. సరోగసి బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు వెళ్లినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాతే ఈ బిల్లులను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు రెండు బిల్లులు రాజ్యసభ ముందు ఉన్నాయని పేర్కొన్నారు. సరోగసి బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఏఆర్టీ బిల్లును పరిగణనలోకి తీసుకుని ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Farmers death: 'రైతుల మరణాలపై సమాచారం లేదు- సాయం చేయలేం'