Lok Sabha Election 2024 Modi Campaign : దేశంలో ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. జనవరి 13వ తేదీన బిహార్‌లో జరగనున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
"బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ విస్తృత ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే బహిరంగ సభలతో ముమ్మర ప్రచారం చేపట్టనుంది. జనవరి 13న రాష్ట్ర పర్యటనతోనే ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని బేగూసరాయ్, బెతియా, ఔరంగాబాద్ ర్యాలీల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ రోజు పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు" అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రచారం చేయనున్న అమిత్ షా, నడ్డా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వచ్చే రెండు నెలల్లో బిహార్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. అనేక బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. జనవరి 15వ తేదీ తర్వాత ముమ్మర ప్రచారం ఉంటుందని సమాచారం. సీతామర్హి, మధేపురా, నలందాల్లో అమిత్ షా పాల్గొననుండగా, సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు.
బిహార్‌పై స్పెషల్ ఫోకస్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీల కూటమి 'ఇండియా'లో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో కూడా నీతీశ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం.
అయితే రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను పార్టీ రాష్ట్ర నాయకుడు చౌదరికి అప్పగించింది అధిష్ఠానం.
2020లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, 2022 ఆగస్టులో కమలం పార్టీతో బంధాన్ని తెంచుకుంది. ఆర్జేడీ, ఇతర పార్టీలతో కూడిన కూటమితో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎనిమిదో సారి నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ 39 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒకటి గెలిచింది.
బీజేపీతో నితీశ్ కటీఫ్? ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ముందుకు..!
'కూటములు మార్చుతూ నీతీశ్ ప్రధాని కాగలరా? 2025లో బిహార్ మాదే!'