Live In Relationship Punjab And Haryana High Court: సహజీవనంలో ఉన్న ప్రేమజంట కేసు విచారణలో భాగంగా.. కీలక తీర్పునిచ్చింది పంజాబ్ హరియాణా హైకోర్టు. 21 ఏళ్లకంటే తక్కువ వయసున్న యువకుడు వివాహం చేసుకోరాదు కానీ.. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న యువతితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చని స్పష్టం చేసింది.
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో ఉంటున్న ఓ ప్రేమజంట.. తమకు భద్రత కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. తమ కుటుంబసభ్యుల అనుమతి లేకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నామని, తమకు ప్రాణహాని ఉందని ఆ యువతీయువకులు హైకోర్టుకు తెలిపారు.
యువతీయువకులిద్దరికీ 18ఏళ్లు నిండాయి. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి కావాలంటే యువకుడి వివాహ వయసు 21 ఉండాలి కనుక వీరి కల్యాణం జరగలేదు. వారి కుటుంబసభ్యులు చంపేస్తారన్న భయం వారిలో ఉందని, వారికి భద్రత కల్పిచాలని ప్రేమజంట తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
" దేశ పౌరుల ప్రాణాలు, ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అతనికి వివాహ వయసు తక్కువగా ఉందన్న కారణంగా అతని ప్రాథమిక హక్కులను హరించరాదు."
-- జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, ప్రధాన న్యాయమూర్తి
ఈ క్రమంలో ప్రేమజంటకు భద్రత కల్పించాలని గురుదాస్‌పుర్ ఎస్ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.
ఇదీ చూడండి: 'ఆన్లైన్ విచారణ'లో లాయర్ రాసలీలలు.. జడ్జి ముందే..