ఈ చిన్నారి పేరు అంజనా శ్రీ. ఏకాగ్రతతో ఈ చిన్నారి చేస్తున్న పనిని ఓ సారి నిశితంగా గమనించండి. లేత వేళ్లతో అంజన ఆవిష్కరిస్తున్న ఆకృతులు మిమ్మల్ని కూడా అబ్బురపరుస్తాయి.
చిన్ననాటి నుంచే ఆసక్తితో....
తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా తిరువప్పూర్ గ్రామానికి చెందిన అంజనా కరోనా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. తన తండ్రి ముత్తుకుమార్ వారసత్వంగా చేస్తున్న వడ్రంగి పనిని అతి తక్కువ సమయంలో నేర్చుకుంది.
ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అంజనా... చిన్నతనం నుంచే చెక్కలపై వేసే కళాకృతులపై మక్కువ పెంచుకుంది. చెక్కలపై తన తండ్రి చెక్కే వివిధ కళాకృతులు చూసి ఆ చిన్నారి ఆశ్చర్యపోయేది. తనకు అలా కళాకృతులు చెక్కాలని ఆశగా ఉన్నా... పాఠశాలకు వెళ్లాల్సి రావడంతో అది సాధ్యం కాలేదు. కానీ కరోనా లాక్‌డౌన్‌తో లభించిన సెలవుల్లో అంజనా వడ్రంగి కళను నేర్చుకొని ఇప్పుడు తండ్రికే చేదోడుగా నిలుస్తోంది.
ఇతర కళల్లోనూ ఆరితేరి!
వడ్రంగి పనితో పాటు అంజన డాన్స్, సిలంబం యుద్ధ కళలోనూ ఆరితేరింది. చేతితో తయారు చేసిన కళాకృతులను రెడిమేడ్ వాటిని సరిపోల్చడం సరికాదని అంజన తెలిపింది. రెడిమేడ్ వాటిలో జీవం ఉండదని వివరించింది. తన తండ్రికి మగపిల్లలు లేరని... ఈ పని వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని అంజనా తెలిపింది. తన కుమార్తె ప్రతిభపై తండ్రి ముత్తుకుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ వేళ అంజనా తనను బొమ్మలు చెక్కే కళ నేర్పించమని కోరిందని, ఆ మాటకు తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. అంజనాకు సూక్ష్మ నైపుణ్యాలను నేర్పించాలని నిర్ణయించుకున్నానని, ఆమె చాలా త్వరగా నేర్చుకుందని గర్వపడుతున్నానని ఆమె తండ్రి వెల్లడించారు. వడ్రంగి కళలో అంజనా నైపుణ్యం సాధించిందని, ఆమె తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని తాను నమ్ముతున్నట్లు ముత్తుకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ- మధ్యప్రదేశ్‌కు వ్యాప్తి