ఉత్తర భారతంలో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పిడుగుపాటుకు 68 మంది మృతి చెందినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.
యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే జీవనాధారమైన పశుసంపదను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో కూడా పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రాజస్థాన్‌లో 20 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు సమాచారం. అమెర్ ప్యాలెస్ సమీపంలోని వాచ్ టవర్ వద్ద కొందరు సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగు పడి పలువురు మరణించారు. టవర్‌పై ఉన్న కొందరు ప్రాణభయంతో కిందికి దూకడం వల్ల గాయాలపాలయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు.
కేంద్రం సాయం..
పిడుగుపాటు ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని మంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు. గాయపడిన వారికి రూ.50వేలు అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి : వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి