మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి. హోంశాఖమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్.. దిల్లీలో ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలవనున్నారు. పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే పండరీపుర్ ఉప ఎన్నిక విషయమై చర్చించేందుకు... 3 రోజుల క్రితమే పవార్‌తో భేటీని నిర్ణయించినట్లు ఎన్సీపీ నేతలు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్ మినహా ఎవరూ స్పందించలేదు. శరద్ పవార్‌తో జరిగే భేటీ తర్వాత నష్టనివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
'నా మెయిల్ ఐడీ నుంచే పంపా'
మరోవైపు, ఠాక్రేకు రాసిన లేఖను తన మెయిల్ ఐడీ నుంచే పంపినట్లు పరమ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు. లేఖ వేరే మెయిల్ ఐడీ నుంచి వచ్చిందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు.
అంతకుముందు, శనివారం ఉదయం 4.37 గంటలకు మెయిల్ వచ్చిందని సీఎం కార్యాలయం తెలిపింది. పరమ్‌బీర్ సింగ్ అధికారిక ఖాతా నుంచి లేఖ రాలేదని పేర్కొంది. ఆయన సంతకం కూడా లేదని వెల్లడించింది. లేఖను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పరమ్‌బీర్ సింగ్ ప్రకటన చేయడం గమనార్హం.
దర్యాప్తు అవసరం: అనురాగ్
ముంబయి పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండి పడ్డారు. లేఖ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముంబయి పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే మహారాష్ట్ర మొత్తం ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు.
లేఖలో ఏముందంటే?
హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పరమ్‌బీర్ సింగ్ ఠాక్రేకు లేఖ రాశారు. నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని పోలీసు అధికారి సచిన్ వాజేకు అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు.
ఇదీ చదవండి: పరమ్Xదేశ్‌ముఖ్- 'మహా'లో లేఖ దుమారం